purohit
-
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్‌నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్‌కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్య పూజారికి కరోనా
అయోధ్య: ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న రామమందిర భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన పూజారి ప్రదీప్ దాస్, ఆలయంలో పూజలు నిర్వహించే నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరైన ఆచార్య సత్యేంద్ర దాస్ శిష్యుడు. ప్రదీప్ దాస్‌ని ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉంచారు. అయోధ్యలో ప్రధాని మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వాటర్ ప్రూఫ్ మండపాలూ, దానిలో ఒక చిన్న వేదికను ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్‌లో భారీ స్క్రీన్లపై.. భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య రామమందిరం త్రీడీ చిత్రాలను ప్రపంచంలోనే అతిపెద్ద 17వేల చదరపుటడుగుల భారీ నాస్డాక్ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫెయిర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ షెహానీ వెల్లడించారు. ఇది జీవిత కాలంలో చూడలేని ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోని భారతీయులంతా అక్కడ సమావేశమౌతారని షెహానీ అన్నారు. -
పురహితురాలు
ఈమె పేరు చిత్ర చంద్రచూడ్. వయసు 72 ఏళ్లు. స్వస్థలం పుణె. ఇరవై ఏళ్ల నుంచీ పౌరోహిత్యం చేస్తున్నారు. వ్రతాలు, నోముల దగ్గర్నుంచి పెళ్లిళ్లు, కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆచార వ్యవహారాలను జరిపించవలసిందిగా కోరుతూ దేశం నలుమూల నుంచీ ఆమెకు పిలుపు వస్తూంటుంది. చిత్ర పౌరోహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో.. ఆడవాళ్లు పూజాపునస్కారాలు చేయించడమేంటని పెదవి విరిచినవారు, భృకుటి ముడివేసిన వారూ లెక్కలేనంతమంది. నిజానికి అంతకుముందు ఆమెకే ఈ అనుమానం ఉండేది. పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించే కంటే ముందు అంటే 1997లో ఆమె ‘గార్గి అజున్ జీవంత్ అహే (గార్గి ఇంకా బతికే ఉంది)’ అనే మరాఠీ పుస్తకాన్ని చదివారు. ఇందులో కథానాయిక వారణాసిలో కర్మకాండలను నిర్వహిస్తూంటుంది. ఆ పుస్తకం చిత్రకున్న భ్రమలను తొలగించింది. ఆమె దృక్పథాన్ని మార్చేసింది. తానూ పౌరోహిత్యం చేయాలనే సంకల్పాన్నిచ్చింది. ఆమె ఒక్కరే.. పుణె కేంద్రంగా.. విద్య, పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి, స్త్రీ సాధికారత కోసం పనిచేసే సంస్థ. ఇందులో చేరి పూజా, పెళ్లి, కర్మకాండలను (హిందూమతాచారాలకు సంబంధించి) జరిపించే విధానాలను నేర్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆమెకు యాభై రెండేళ్లు. ఇంట్లో ఇంకా బాధ్యతలున్నాయి. తను తీసుకున్న నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారు చిత్ర. ‘‘ఇంటి పనుల్లో సహాయపడ్తాను.. వెళ్లి నేర్చుకో’’ అని భర్త ప్రోత్సహించాడు. జ్ఞానబోధినిలో చేరారు ఆమె. పూజావిధానాలను నేర్చుకోవడానికి చేరిన వాళ్లలో చిత్ర మినహా మిగిలిన వాళ్లంతా పురుషులే. నిర్దేశించినదాని కంటే తక్కువ సమయంలో అన్నీ నేర్చుకున్నారు ఆమె. చిత్రంగా... మొదట్లో జ్ఞానబోధిని తరపునే పూజాకార్యక్రమాలు చేయించడానికి వెళ్లేవారు చిత్ర. ఆవిడను చూడగానే ‘‘గురువుగారికి ఆలస్యమవుతుందని మిమ్మల్ని పంపించారా?’’ అని అడిగేవారట యజమానులు. ‘‘లేదండి.. నేనే చేయిస్తాను’’ అని సమాధానమిచ్చేవారట చిత్ర. సందేహంతోనే పూజలో కూర్చునేవారట. అయిపోయాక.. ఆనందంగా సంభావన ఇచ్చుకునేవారట ‘‘మీలాగ ఇంత వివరంగా.. ఇంత బాగా ఏ పురోహితుడూ చేయించలేదండీ’’ అంటూ! ఇప్పుడైతే చిత్రే రావాలనే డిమాండ్..అంత ప్రాచుర్యం పొందారు ఆమె. ‘‘సాం కేతికంగా.. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ఉన్నా.. ఆచారాల పరంగా చాలా వెనకబడే ఉన్నాం. ఎంతలా అంటే.. జన్మనిచ్చిన వాళ్లు పోయినా వాళ్లకు తల కొరివి కొడుకే పెట్టాలి కాని ఆడపిల్ల పెట్టకూడదు. అలాంటి నమ్మకాల కోసం కడుపులో ఉన్న ఆడశిశువులు కన్ను తెరవకుండా చేసుకుంటున్నాం. ఇలాంటి సంప్రదాయాలను నేను పాటించను. అందుకే నేను కర్మకాండలు చేయించడానికి వెళ్లినప్పుడు.. ఆ ఇంటి ఆడపిల్లలనూ అందులో పాల్గొనేలా చేస్తా.. ఇంకో మాట.. సాధారణంగా నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు చేయించే పురోహితులు కర్మకాండలు చేయించరు. అలాగే కర్మకాండలు చేయించే పురోహితులు పెళ్లిళ్లూ చేయించరు. కాని నేను అన్నీ చేయిస్తాను. అంతేకాదు.. మన దగ్గర శుభకార్యాలకు సంబంధించిన పూజాకార్యక్రమాల్లో భర్త పోయిన స్త్రీ పార్టిసిపేట్ చేయదు. కాని భార్య పోయిన పురుషుడు ఆ పూజలు చేయొచ్చు. అలాంటి సంప్రదాయానికీ చెక్ పెట్టాను. ఒకసారి ఓ పెళ్లి జరిపించడానికి వెళ్లాను. వధూ వరులిద్దరికీ తండ్రి లేకపోవడంతో ఆ ఇద్దరు మహిళలు ఆ శుభకార్యానికి దూరంగా ఉండి అన్ని వ్యవహారాలను ఎవరి చేతనో చేయిస్తున్నారు. అప్పుడు నేను వాళ్లను పిలిచి.. పీటల మీద వాళ్లనే కూర్చోబెట్టి.. నిర్విఘ్నంగా ఆ పెళ్లి జరిపించా. మొదట కొంత జంకినా, తర్వాత వాళ్లు తమ పిల్లల పెళ్లికి తాము నిమిత్తమాత్రులు కాకుండా తామే కర్తలుగా పీటల మీద కూర్చుని పెళ్లి చేయించగలిగినందుకు ఎంతో సంతోషించారు. ఇప్పటికీ ఆ జంట చక్కగా ఉంది’’ అని గుర్తు చేసుకున్నారు చిత్ర చంద్రచూడ్. చిత్ర స్ఫూర్తితో ఆమె కోడలూ పౌరోహిత్యంలోకి అడుగుపెట్టారు. -
సాధ్వి, పురోహిత్‌పై ఉగ్రవాద అభియోగాలు
ముంబై: మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో ఐదుగురిపై మంగళవారం ఉగ్రవాద సంబంధిత అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 2న ఈ కేసులో తుది విచారణ ప్రారంభమవుతుంది. ఉగ్రవాద వ్యాప్తికే నిందితులు అభినవ్ భారత్ అనే సంస్థను ప్రారంభించారని పేర్కొన్న ప్రత్యేక కోర్టు..వారిపై నేరపూరిత కుట్ర, హత్య తదితర నేరారోపణల్ని కూడా మోపింది. ఐపీసీ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ కోర్టు జడ్జి వినోద్ పాదాల్కర్ ఈ మేరకు ఏడుగురిపై అభియోగాలు నమోదుచేశారు. నిందితుల్లో ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు మేజర్(రిటైర్డ్) రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. జడ్జి ఈ అభియోగాలు నమోదుచేసిన సమయంలో నిందితులంతా కోర్టులోనే ఉన్నారు. వారు దోషులుగా తేలితే జీవితఖైదు లేదా మరణశిక్ష పడుతుంది. -
మాలెగావ్ కేసు : సాధ్వి ప్రాగ్య, పురోహిత్‌లపై అభియోగాలు
సాక్షి, ముంబై : 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్య, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. వీరిద్దరితో సహా ఏడుగురిపై కుట్ర, హత్యాయత్నం సహా పలు అభియోగాలు మోపింది. అయితే తామెలాంటి నేరానికి పాల్పడలేదని నిందితులు వాదించగా కేసు విచారణను నవంబర్ రెండుకు న్యాయస్ధానం వాయిదా వేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లోని మసీదు సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయాలయ్యాయి. ఈ కేసులో పురోహిత్, ప్రగ్యా సింగ్‌లతో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిలపై ఎన్ఐఏ ఇతర నిందితులుగా పేర్కొంది. కాగా ఈ కేసు నుంచి తమను తప్పించాలని కోరుతూ సాధ్వి ప్రగ్యా, పురోహిత్ సహా ఇతర నిందితుల వినతిని గత ఏడాది డిసెంబర్ 27న ఎన్ఐఏ న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
పురోహిత్ ప్రజల గవర్నర్
తంజావూర్: జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర గవర్నర్‌ను ప్రతిపక్షాలు తప్పుబడుతుండగా ఆయనకు తమిళనాడు మంత్రి ఒకరు అండగా నిలిచి పురోహిత్ ప్రజల గవర్నర్ అని కొనియాడారు. కమలాలు పండించే నాగపూర్ నుంచి ధాన్యం పండించే తంజావూర్‌కు వచ్చారని తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, పీఎంకే, ఏఐడీఎంకే నుంచి విడిపోయిన టి.టి.వి.దినకరన్‌లు గవర్నర్ చర్యలను తప్పుబట్టారు. ఇది రాష్ట్ర హక్కులలో జోక్యం చేసుకోవడమే అవుతుందని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కొందరు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పురోహిత్ ఎంజీఆర్‌కు నివాళులర్పించి ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనియాడారు. -
తమిళనాడుకు కొత్త గవర్నర్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. ఆదివారం తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తమిళనాడుకు ఏడాది తర్వాత పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించినట్లయింది. ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్ఎస్జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాడుకు ఏడాది కాలంగా పూర్తిస్థాయి గవర్నర్ లేని విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త గవర్నర్ల గురించి క్లుప్తంగా... బన్వారీలాల్ పురోహిత్: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీ య, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలు గా క్రీయాశీలంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్ దినపత్రికను పునరుద్ధరించారు. సత్యపాల్ మాలిక్: ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది. గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నిక య్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు. జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా∙పతకం అందుకున్నారు. బీడీ మిశ్రా: ఎన్ఎస్జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. -
హైదరాబాద్‌లో రాజస్తానీ ముఠా హల్ చల్
హైదరాబాద్ : రాజస్తాన్ నుంచి వచ్చిన ఓ ముఠా హైదరాబాద్‌లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన సంఘటన కలకలం సృష్టించింది. వ్యాపార నిమిత్తం అహ్మదాబాద్‌కు చెందిన పురోహిత్‌ను ఆ ముఠా సభ్యులు హైదరాబాద్‌కు పిలిచారు. ఇక్కడికి వచ్చిన తరువాత వ్యాపారిని బంధించి అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.3 కోట్ల డిమాండ్ చేశారు. అయితే అంత ఇవ్వలేనంటూ రూ. 25 లక్షలు చెల్లించారు. దాంతో డబ్బు తీసుకున్న కిడ్నాపర్లు వ్యాపారిని వదిలేశారు. కాగా అనంతరం పురోహిత్ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించటంతో ....బోయిన్‌పల్లిలో ముఠా సభ్యులు ఉంటున్న నివాసంపై దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసికట్టిన ఆ ముఠా అక్కడ నుంచి పరారైంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.