పురహితురాలు | Chandrachud is being drowned since the age of twenty years | Sakshi
Sakshi News home page

పురహితురాలు

Published Tue, Mar 26 2019 12:50 AM | Last Updated on Tue, Mar 26 2019 12:50 AM

Chandrachud is being drowned since the age of twenty years - Sakshi

ఈమె పేరు చిత్ర చంద్రచూడ్‌. వయసు 72 ఏళ్లు. స్వస్థలం పుణె. ఇరవై ఏళ్ల నుంచీ పౌరోహిత్యం చేస్తున్నారు. వ్రతాలు, నోముల దగ్గర్నుంచి పెళ్లిళ్లు, కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆచార వ్యవహారాలను జరిపించవలసిందిగా కోరుతూ దేశం నలుమూల నుంచీ ఆమెకు పిలుపు వస్తూంటుంది. చిత్ర పౌరోహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో.. ఆడవాళ్లు పూజాపునస్కారాలు చేయించడమేంటని పెదవి విరిచినవారు, భృకుటి ముడివేసిన వారూ లెక్కలేనంతమంది.  నిజానికి అంతకుముందు ఆమెకే ఈ అనుమానం ఉండేది. పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించే కంటే ముందు అంటే 1997లో ఆమె ‘గార్గి అజున్‌ జీవంత్‌ అహే (గార్గి ఇంకా బతికే ఉంది)’ అనే మరాఠీ పుస్తకాన్ని చదివారు. ఇందులో కథానాయిక వారణాసిలో కర్మకాండలను నిర్వహిస్తూంటుంది. ఆ పుస్తకం చిత్రకున్న భ్రమలను తొలగించింది. ఆమె దృక్పథాన్ని మార్చేసింది. తానూ పౌరోహిత్యం చేయాలనే సంకల్పాన్నిచ్చింది. 

ఆమె ఒక్కరే.. 
 పుణె కేంద్రంగా.. విద్య, పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి, స్త్రీ సాధికారత కోసం పనిచేసే సంస్థ. ఇందులో చేరి పూజా, పెళ్లి, కర్మకాండలను (హిందూమతాచారాలకు సంబంధించి) జరిపించే విధానాలను నేర్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆమెకు యాభై రెండేళ్లు. ఇంట్లో ఇంకా బాధ్యతలున్నాయి. తను తీసుకున్న నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారు చిత్ర. ‘‘ఇంటి పనుల్లో సహాయపడ్తాను.. వెళ్లి నేర్చుకో’’ అని భర్త ప్రోత్సహించాడు. జ్ఞానబోధినిలో చేరారు ఆమె. పూజావిధానాలను నేర్చుకోవడానికి చేరిన వాళ్లలో చిత్ర మినహా మిగిలిన వాళ్లంతా పురుషులే. నిర్దేశించినదాని కంటే తక్కువ సమయంలో అన్నీ నేర్చుకున్నారు ఆమె. 

చిత్రంగా...
మొదట్లో జ్ఞానబోధిని తరపునే పూజాకార్యక్రమాలు చేయించడానికి వెళ్లేవారు చిత్ర. ఆవిడను చూడగానే ‘‘గురువుగారికి ఆలస్యమవుతుందని మిమ్మల్ని పంపించారా?’’ అని అడిగేవారట యజమానులు. ‘‘లేదండి.. నేనే చేయిస్తాను’’ అని సమాధానమిచ్చేవారట చిత్ర. సందేహంతోనే పూజలో కూర్చునేవారట. అయిపోయాక.. ఆనందంగా సంభావన ఇచ్చుకునేవారట ‘‘మీలాగ ఇంత వివరంగా.. ఇంత బాగా ఏ పురోహితుడూ చేయించలేదండీ’’ అంటూ! ఇప్పుడైతే చిత్రే రావాలనే డిమాండ్‌..అంత ప్రాచుర్యం పొందారు ఆమె. ‘‘సాం కేతికంగా.. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ఉన్నా.. ఆచారాల పరంగా చాలా వెనకబడే ఉన్నాం. ఎంతలా అంటే.. జన్మనిచ్చిన వాళ్లు పోయినా వాళ్లకు తల కొరివి కొడుకే పెట్టాలి కాని ఆడపిల్ల పెట్టకూడదు. అలాంటి నమ్మకాల కోసం కడుపులో ఉన్న ఆడశిశువులు కన్ను తెరవకుండా చేసుకుంటున్నాం. ఇలాంటి సంప్రదాయాలను నేను పాటించను. అందుకే నేను కర్మకాండలు చేయించడానికి వెళ్లినప్పుడు.. ఆ ఇంటి ఆడపిల్లలనూ అందులో పాల్గొనేలా చేస్తా.. ఇంకో మాట.. సాధారణంగా నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు చేయించే పురోహితులు కర్మకాండలు చేయించరు.

అలాగే కర్మకాండలు చేయించే పురోహితులు పెళ్లిళ్లూ చేయించరు. కాని నేను అన్నీ చేయిస్తాను. అంతేకాదు.. మన దగ్గర శుభకార్యాలకు సంబంధించిన పూజాకార్యక్రమాల్లో భర్త పోయిన స్త్రీ పార్టిసిపేట్‌ చేయదు. కాని భార్య పోయిన పురుషుడు ఆ పూజలు చేయొచ్చు. అలాంటి సంప్రదాయానికీ చెక్‌ పెట్టాను. ఒకసారి ఓ పెళ్లి జరిపించడానికి వెళ్లాను. వధూ వరులిద్దరికీ తండ్రి లేకపోవడంతో ఆ ఇద్దరు మహిళలు ఆ శుభకార్యానికి దూరంగా ఉండి అన్ని వ్యవహారాలను ఎవరి చేతనో చేయిస్తున్నారు. అప్పుడు నేను వాళ్లను పిలిచి.. పీటల మీద వాళ్లనే కూర్చోబెట్టి.. నిర్విఘ్నంగా ఆ పెళ్లి జరిపించా. మొదట కొంత జంకినా, తర్వాత వాళ్లు తమ పిల్లల పెళ్లికి తాము నిమిత్తమాత్రులు కాకుండా తామే కర్తలుగా పీటల మీద కూర్చుని పెళ్లి చేయించగలిగినందుకు ఎంతో సంతోషించారు. ఇప్పటికీ ఆ జంట చక్కగా ఉంది’’ అని గుర్తు చేసుకున్నారు చిత్ర చంద్రచూడ్‌.  
చిత్ర స్ఫూర్తితో ఆమె కోడలూ పౌరోహిత్యంలోకి అడుగుపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement