పాలకూరలో ‘ఇంధన’ సూత్రం!
మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకుని కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులను విడగొట్టి కార్బోహైడ్రేట్ల(పిండి పదార్థాల)ను తయారు చేసుకుంటాయని, ఈ పద్ధతిని కిరణజన్య సంయోగక్రియ అంటారనీ మనకు తెలిసిందే. అయితే.. సూర్యకాంతిని బాగా ఉపయోగించుకుని ఎక్కువ శక్తిగా మార్చుకోవడంలో మిగతా మొక్కల కంటే.. పాలకూర రెండాకులు ఎక్కువే చదివిందట! దీని ఆకుల్లో ఉండే ‘ఫోటోసిస్టమ్ 2’ అనే ప్రత్యేక ప్రొటీన్ల వ్యవస్థ మిగతా మొక్కల కంటే సూర్యకాంతిని ఎక్కువ సమర్థంగా ఉపయోగించుకుంటోందని పుర్దీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇంతవరకూ ఎవరూ తయారు చేయలేనంతగా సూర్యరశ్మి ద్వారా 60 శాతం సమర్థంగా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయాలని ప్రయోగాలు మొదలుపెట్టిన ప్రొఫెసర్ యులియా పుష్కర్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు పాలకూరలో అరుదైన సూత్రాన్ని గుర్తించింది. పాలకూర ఫొటోసిస్టమ్-2లోని ప్రొటీన్ల పనితీరు ఆధారంగా.. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ జరిపే పరికరాలను తయారు చేస్తే.. హైడ్రోజన్ ఇంధనాన్ని సులభంగా, పెద్ద మొత్తంలో తయారు చేయొచ్చని వారు భావిస్తున్నారు.