Purusottapatnam
-
ఏపీలో ఇసుక దోచేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భారీస్థాయిలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ రోజూ రూ.కోట్లు దోచుకుతింటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రాజ్యవర్థన్రాథోర్ బెంచ్ సోమవారం విచారించింది. ఏపీలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు ఇచ్చిందని,అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఈ కేసును ఎన్జీటీ చైర్మన్ నేతృత్వంలోని బెంచ్ విచారించడంతో ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడంపై ఆ బెంచ్‌కే ఈ కేసును రిఫర్ చేస్తున్నామని జస్టిస్ రాజ్యవర్థన్ తెలిపారు. వారికి పరిహారమివ్వండి.. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మాణంవల్ల తమ జీవనోపాధికి గండి ఏర్పడిందని బాధిత మత్స్యకారులు ఎన్జీటీని ఆశ్రయించారు. కేజీ బేసిన్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడి మత్స్యకారులకు నెలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారని, పోలవరం విషయంలోనూ అదే పరిహారాన్ని అందించాలని పిటిషనర్లు కోరారు. కేసు విచారణకు స్వీకరించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం అథారిటీ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. ‘పురుషోత్తపట్నం’ పోలవరంలో భాగమేనా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. నిర్వాసితులు సత్యనారాయణ, రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం ప్రాజెక్టులో పురుషోత్తపట్నం ప్రాజెక్టు భాగమా? కాదా?, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా?లేవా? అన్న విషయాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ, పోలవరం అథారిటీలకు నోటీసులు జారీ చేసింది. -
తూర్పు’న మరో పట్టిసీమ ‘పథకం’!
విశాఖపట్నానికి నీరు తరలించేందుకే? ‘పుష్కర’ను పరిశీలించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ పురుషోత్తపట్నం : మరో పట్టిసీమ ఎత్తిపోతల ‘పథకానికి’ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? తూర్పు గోదాకరి జిల్లా అధికారుల హడావిడి చూస్తే అవునన్నట్టుగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం లాగే, పురుషోత్తపట్నం –రామచంద్రపురం మధ్య ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, పోలవరం కాలువ ద్వారా విశాఖపట్నానికి నీరు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గురువారం కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువను పరిశీలిందచేందుకు వచ్చిన ఆయన వెంట పుష్కర ఎల్ఎంసీ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు కూడా ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ ఏడు ప్యాకేజీలుగా ఉండగా, ఇందులో ఐదు కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో సోమా కంపెనీ నూరు శాతం పనులు చేయగా, మిగిలిన నాలుగు కంపెనీలు కేవలం 60 నుంచి 80 శాతం పనులు మాత్రమే చేసినట్టు సమాచారం. ఆయా పరిస్థితులపై కలెక్టర్ ఆరాతీసినట్టు తెలిసింది. కాగా వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయగలరా లేక కొత్త కంపెనీలకు ఇవ్వాలనే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకే వీటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
మా గతేంటి!?
పోలవరం ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే ‘పుష్కర’ నిరుపయోగం! ఆందోళన చెందుతున్న కాంట్రాక్ట్ సిబ్బంది పురుషోత్తపట్నం (సీతానగరం) :పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పూర్తయితే.. దాని దిగువ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రాజెక్టు దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాల భవితవ్యం ఏమిటన్నదీ గందరగోళమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది తమ జీవనోపాధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకంలో ఎనిదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 9 మంది ఆపరేటర్లు, ఆరుగురు హెల్పర్లు, నలుగురు వాచ్మెన్లు, ఇద్దరు పైపులైన్ వర్కర్లు, ఒక గార్డెనర్ ఉన్నారు. జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఏడాది జూలై చివరి వారంలో ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసే సందర్భంలో ప్రజాప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటే ఏటా వారికి వినతిపత్రాలు సమర్పించడం పరిపాటిగా మారింది. జీతాలు సక్రమంగానే అందుతున్నా.. ఉద్యోగ భద్రత లేకపోవడంతో.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన నిత్యం వీరిలో వ్యక్తమవుతోంది. తాజాగా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పుష్కర పథకం ప్రశ్నార్థకమేనన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ సిబ్బందికి మరింత బెంగ పట్టుకుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, పుష్కర కాలువలకు పోలవరం నుంచి నేరుగా నీరు చేరుతుందని నిపుణులు చెబుతున్న మాటలను వారు ప్రస్తావిస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని, ఒకవేళ పుష్కర పథకం స్తంభిస్తే తమకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.