పోలవరం ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే ‘పుష్కర’ నిరుపయోగం!
ఆందోళన చెందుతున్న కాంట్రాక్ట్ సిబ్బంది
పురుషోత్తపట్నం (సీతానగరం) :పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పూర్తయితే.. దాని దిగువ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రాజెక్టు దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాల భవితవ్యం ఏమిటన్నదీ గందరగోళమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది తమ జీవనోపాధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకంలో ఎనిదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
వీరిలో 9 మంది ఆపరేటర్లు, ఆరుగురు హెల్పర్లు, నలుగురు వాచ్‌మెన్లు, ఇద్దరు పైపులైన్ వర్కర్లు, ఒక గార్డెనర్ ఉన్నారు. జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఏడాది జూలై చివరి వారంలో ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసే సందర్భంలో ప్రజాప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటే ఏటా వారికి వినతిపత్రాలు సమర్పించడం పరిపాటిగా మారింది.
జీతాలు సక్రమంగానే అందుతున్నా.. ఉద్యోగ భద్రత లేకపోవడంతో.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన నిత్యం వీరిలో వ్యక్తమవుతోంది. తాజాగా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పుష్కర పథకం ప్రశ్నార్థకమేనన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ సిబ్బందికి మరింత బెంగ పట్టుకుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, పుష్కర కాలువలకు పోలవరం నుంచి నేరుగా నీరు చేరుతుందని నిపుణులు చెబుతున్న మాటలను వారు ప్రస్తావిస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని, ఒకవేళ పుష్కర పథకం స్తంభిస్తే తమకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మా గతేంటి!?
Published Wed, Apr 27 2016 1:11 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement