రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
-కాపు ఉద్యమనేత ముద్రగడ
-పుష్కర ఘటనలో చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్
అంబాజీపేట : కాపు రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. అంబాజీపేటలో గురువారం రవణం వెంకట్రావు ఇంట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనందున గాంధేయ మార్గంలో తలపెట్టిన పాదయాత్రను పోలీసు బలగాలతో అణచివేయడం దురదృష్టకరమన్నారు. గత ఏడాది పుష్కరాల సందర్భంగా షూటింగ్ కోసం జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణానికి కారకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా తప్పుడు కేసులతో కాపు యువతను పోలీసులు భయపెడుతున్నారన్నారు. తమ ప్రమేయం ఉన్నట్లు రుజువైతే తన యావదాస్తిని అమ్మి నష్టపరిహారం చెల్లిస్తామని ఇటీవల డీజీపీకి పంపిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి రూ.వేయి కోట్లు మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.
గత జన్మలోనూ కేసులున్నాయేమో చూడండి..
తనపై ఎన్ని కేసులు ఉన్నాయో చూడాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్న చంద్రబాబు తనపై గత జన్మలో కూడా ఏమైనా కేసులు ఉన్నాయేమో చూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు చేసే యాత్రలకూ అనుమతులు ఉన్నాయా, కాపు జాతి కోసం చంద్రబాబు ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకువచ్చాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు సోకుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ పోరాటం వల్ల ఏ కులానికి, ఏ వర్గానికి నష్టం జరగదని, తమకిస్తామన్న రిజర్వేషన్లను ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. మంజునాథ కమిషన్ వేసి దాన్ని కూడా అడ్డుకునే కుతంత్రానికి చంద్రబాబు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల జేఏసీ నాయకులతో వచ్చే నెల 2న కాకినాడలో సమావేశమై రిజర్వేషన్ల కోసం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణు, గంటా స్వరూప, పత్తి దత్తుడు, యర్రా నాగబాబు, యేడిద శ్రీను, శిరిగినీడి వెంకటేశ్వరరావు, జక్కంశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.