నేత్రపర్వం.. శ్రీవారి విహారం
ద్వారకా తిరుమల : సుదర్శన పుష్కరణిలో హంస వాహన రూరుడైన చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి శనివారం రాత్రి విహరించారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ తెప్ప ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. మిరమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, డప్పు వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ఈ ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా తొళక్కవాహనంపై ఉయభదేవేరులతో శ్రీవారిని ఉంచి, ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీది సేవ అనంతరం వాహనాన్ని సుదర్శన పుష్కరణి వద్దకు అట్టహాసంగా తీసుకొచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న పుష్కరణిలో హంసవాహనంగా అలంకరించిన తెప్పలో స్వామి, అమ్మవార్లను ఉంచారు. ఆలయ చైర్మ¯ŒS ఎస్వీ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా పాల్గొని తెప్పలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన చినవెంకన్నకు విశేషపూజలు జరిపారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారు పుష్కరణిలో వహించారు. పుష్కరణి మద్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
కొత్త జంటలతో కళకళలాడిన క్షేత్రం
శ్రీవారి క్షేత్రం శనివారం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. క్లోక్ రూములు నిండిపోవడంతో యాత్రికుల బ్యాగులను అనివేటి మండపంలో భద్రపరిచారు. క్షేత్రంలో శనివారం తెల్లవారుజామున వివాహాలు అధికంగా జరిగాయి. కొత్త జంటలు, వారి బంధువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.2.02 లక్షల విరాళం
ద్వారకా తిరుమల :
శ్రీ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా రూ.2,02,232లను శనివారం విరాళంగా అందించారు. భీమవరానకి చెందిన మోహ¯ŒSదాస్ అనే భక్తుడు గంధం వెంకట విశ్వేశ్వరరావు, వెంకట ఉష దంపతుల పేరున రూ.1,01,116లను, కొవ్వూరుకు చెందిన ఏలూరిపాటి శ్రీరామచంద్రమూర్తి రూ. 1,01,116 విరాళాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ పత్రాలను అందించి అభినందించారు.