కనుల పండువగా పుష్పయాగోత్సవం
– ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు
కదిరి : పక్షంరోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణలో జరిగిన పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచభూతాలు, దేవతామూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు జరిగిందే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి తెలియజేశారు. సోమవారం నాటి తీర్థవాది ఉత్సవం ముగియగానే ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి మంగళవారం వేకువజామునే ఆలయ ద్వారాలు తెరిచి మహాసంప్రోక్షణ గావించారు.
అనంతరం స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వదర్శనభాగ్యం కలిగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. యాగోత్సవానికి ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ, పూల కుసుమకుమారి కుటుంబసభ్యులు వ్యవహరించినట్లు ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు తెలియజేశారు. బెంగుళూరుకు చెందిన భక్తుడు బీఎన్ మూర్తి పుష్పయాగోత్సవానికి కావాల్సిన వివిధ రకాల పుష్పాలు తీసుకురావడంతో పాటు పెద్ద మొత్తంలో బాణసంచా తెచ్చి ఆలయ ప్రాంగణంలో పేల్చి భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోపూరి చంద్రశేఖర్, కరె నాగరాజు, రొడ్డారపు నాగరాజు, ఇద్దె రఘునాథరెడ్డి, డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు దంపతులు తదితరులు పాల్గొన్నారు.