పంట కాలువలకూ ఘాట్లు!
కృష్ణాపుష్కరాలకు సన్నాహాలు
అదనపు మినీ ఘాట్లుగా నామకరణం
ఖరీఫ్ సీజను అనుభవాలతో ముందస్త్తు జాగ్రత్త !
తెనాలి : కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ఆరంభించింది. పుష్కరఘాట్ల ఏర్పాటు అంశాలపై ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఘాట్ల నిర్మాణానికి వ్యయ అంచనాలను తయారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపనున్నారు. ఈ పర్యాయం కృష్ణానదిలోనే కాకుండా ఆ నది నీరు ప్రవహించే పంటకాలువల వెంట కూడా పుష్కరఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయటం విశేషం. నదిలో నీటి లభ్యత కొరవడితే మినీఘాట్లుగా పిలుచు కుంటున్న కాలువల ఘాట్లలోనూ భక్తులకు పుష్కరస్నానం ఆచరించే అవకాశం కల్పించాలనేది దీనివెనుక ఉద్దేశంగా చెబుతున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్ర తీరం వరకు సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో కుడి వరదకట్ట నుంచి నదిలోకి ఈ పర్యాయం 40 పుష్కరఘాట్లు ఉండేలా చూడనున్నారు.
గత పుష్కరాలకు నిర్మించిన ఘాట్లకు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తేవడమే కాకుండా, మరి కొన్ని కొత్తగా నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీలైనంత ఎక్కువమంది భక్తులు పుణ్యస్నానం ఆచరించేలా చూడాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనల్లో కనీసం 40 అమల్లోకి తెచ్చేందుకు అవకాశముందని సమాచారం. గతంలో ఉన్న ఘాట్ల మరమ్మతులకు, అదనంగా ఘాట్ల ఏర్పాటుపై ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను దేవాదాయ, నీటిపారుదల అధికారులు స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఈసారి కొన్ని ముఖ్యమైన పంట కాలువల వెంట మరో 20 పుష్కరఘాట్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, నీటి పంపిణీ సంఘాల నేతలు ప్రతిపాదించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజనులో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వచ్చే ఏడాది ఆగస్టులో వచ్చే పుష్కరాలకు ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదిలే అవకాశాలు లేకపోతే ఎలాగన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. పశ్చిమడెల్టాలో ఖరీఫ్ వరి నాట్లు ముమ్మరంగా సాగే తరుణమది.
ప్రధాన జలాశయాల నుంచి నీరందకపోతే, పంట కాలువలకు సరఫరానే పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు నదివెంట సముద్రతీరం వరకు ప్రజలకు పుష్కరస్నానాలు ఆచరించేందుకు వీలుగా బ్యారేజీ దిగువకు నీటి విడుదల అసాధ్యమనే చెప్పాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా కొమ్మమూరు కాలువ, రేపల్లె బ్యాంక్ కెనాల్ వంటి ముఖ్యమైన పంట కాలువల్లోనూ ఘాట్లను ఏర్పరచి, పుణ్యస్నానం ఆచరించే అవకాశం కల్పించాలని ప్రభుత్వ అధికారు లు, నీటి పంపిణీ సంఘాల నేతలు తలపోశారు. అనుకున్నదే తడవుగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అదనపు మినీ ఘాట్లుగా ఇవి తెరపైకి రానున్నాయి.