మునిగిన పుష్కరఘాట్లు
వెల్గటూరు : మండలంలోని కోటిలింగాలలో గోదావరి ఆదిపుష్కరాల కోసం ఏడాది క్రితం నిర్మించిన పుష్కర ఘాట్లు వరద నీటిలో శుక్రవారం పూర్తిగా మునిగిపోయాయి. అంత్యపుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు కోటిలింగాలకు చేరుకుంటున్నారు. పుష్కరఘాట్లు పూర్తిగా మునిగి పోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. గోదావరి సమీపంలో ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతోపాటు హెచ్చరికలు జారీ చేసే సిబ్బంది సైతం కనిపించడం లేదు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు రెవెన్యూ లేదా పోలీసుల పహారాను ఏర్పాటు చేయాలి. బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన గదులను, ఆలయ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను సైతం వరదనీరు చుట్టుముట్టింది. వరద మరింత పెరిగితే ఆలయ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. గోదావరి శాంతించే వరకు ఇక్కడ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.