puttapartinarayanacharyulu
-
సరస్వతీ పుత్రుడు
‘వాణి నా రాణి’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడు చెప్పుకున్నట్లు శ్రీశ్రీ ‘ఈ శతాబ్దం నాది’ అని వెల్లడించుకున్న తరహాలోనే ‘పాండితీ శోభ పదునాల్గు భాషలందు’ అని సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సగర్వంగా చెప్పుకున్నారు. వందకుపైగా కృతులను రచించి తెలుగు భాషకు వన్నె తెచ్చిన పుట్టపర్తి.. ప్రాచీనతకు, నవ్యతకు ఓ వారధిగా నిలిచారు. ‘ఘల్లుఘల్లుమని చిలిపిగజ్జెల మోయ/ ఆడెనమ్మో శివుడు! పాడెనమ్మ శివుడు!’ అంటూ శివతాండవం అనే అద్భుత కావ్యాన్ని రాశారు. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేరులో జన్మించారు. మొత్తం 14 భాషలను నేర్చుకుని సెహబాస్ అనిపించుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రాశారు. ఈ రసమయ కావ్యాన్ని విద్వాన్ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. ఆయన విద్వాన్ పరీక్షకు (1938) హాజరైనప్పుడు తాను రచించిన ఈ కావ్యాన్ని చదువుకోవలసి వచ్చింది. అయితే ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం నుంచి వచ్చిన రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలుపెట్టి ఆ ఒక్క జవాబే 40 పేజీలు రాస్తూ ఉండిపోవడంతో సమయం సరిపోలేదు. దీంతో పరీక్ష తప్పారు. పుట్టపర్తి వారి కావ్యాల్లో మరో ఆణిముత్యం ‘షాజీ’. ఈ కావ్యాన్ని తన తొమ్మిదవ ఏటనే రాశారు. దీన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. అరవిందయోగి రాసిన ఆంగ్లగ్రంథాల్లో ఎనిమిదింటిని తేటతెనుగులో అనువదిం చారు. వీటిలో ‘గీతోపన్యాసాలు’, ‘తలుపులు–మెరుపులు’ ముఖ్యమైనవి. విశ్వనాథ సత్యనారాయణ రచన ఏకవీర నవలను మలయాళంలోకి అనువదించారు. హృషికేష్లో ఆయన ప్రతిభా వైదుష్యానికి ముగ్ధుడైన శివానంద సరస్వతి ఆయనకు సరస్వతీపుత్ర బిరుదునిచ్చి సత్కరించారు. 1974లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది. తెలుగు సాహిత్య వినీలాకాశంలో నారాయణాచార్యులు ధ్రువతారగా నిలుస్తారు. ఆ మహానుభావుడు 1990 సెప్టెంబర్ 1న ఈ ప్రపం చం నుంచి నిష్క్రమించారు. (నేడు పుట్టపర్తి నారాయణాచార్యులు 105వ జయంతి సందర్భంగా) వాండ్రంగి కొండలరావు, స్వతంత్ర జర్నలిస్టు, పొందూరు మొబైల్ : 94905 28730 -
పుట్టపర్తికి ఘన నివాళి
ప్రొద్దుటూరు కల్చరల్: పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి సందర్భంగా శివాలయం సెంటర్లోని పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు గానుగపెంట హనుమంత రావు మాట్లాడుతూ 14 భాషాల్లో పాండిత్యం కలిగిన అసాధరణ మేధావి పుట్టపర్తి అని కొనియాడారు. కడపలో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన నివశించిన భవనాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం కమిటీ చైర్మన్ శంకరనారాయణ, మొల్లా సాహితీ పీఠం ఉపాధ్యక్షులు మునెయ్య, పేరి గురుస్వామి, పుట్టపర్తి సాహితీపీఠం కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, రచయితలు, కవులు డాక్టర్ గోపాల్‌రెడ్డి, మునిస్వామి, భాస్కర్‌రాజు, అశోక్, తవ్వా సురేష్ పాల్గొన్నారు. అలాగే అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లోని స్త్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి ప్రొద్దుటూరు వాసి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ గోపాలరావు, నిర్వహణ కార్యదర్శి రాంప్రసాద్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, ఖాసీం సాహెబ్, ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.