సరస్వతీ పుత్రుడు | Puttaparthi Narayanacharyulu 105th Birth Anniversary | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుత్రుడు

Published Thu, Mar 28 2019 12:29 AM | Last Updated on Thu, Mar 28 2019 12:29 AM

Puttaparthi Narayanacharyulu 105th Birth Anniversary - Sakshi

‘వాణి నా రాణి’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడు చెప్పుకున్నట్లు శ్రీశ్రీ ‘ఈ శతాబ్దం నాది’ అని వెల్లడించుకున్న తరహాలోనే ‘పాండితీ శోభ పదునాల్గు భాషలందు’ అని సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సగర్వంగా చెప్పుకున్నారు. వందకుపైగా కృతులను రచించి తెలుగు భాషకు వన్నె తెచ్చిన పుట్టపర్తి.. ప్రాచీనతకు, నవ్యతకు ఓ వారధిగా నిలిచారు. ‘ఘల్లుఘల్లుమని చిలిపిగజ్జెల మోయ/ ఆడెనమ్మో శివుడు! పాడెనమ్మ శివుడు!’ అంటూ శివతాండవం  అనే అద్భుత కావ్యాన్ని రాశారు.

1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేరులో జన్మించారు. మొత్తం 14 భాషలను నేర్చుకుని సెహబాస్‌ అనిపించుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రాశారు. ఈ రసమయ కావ్యాన్ని విద్వాన్‌ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. ఆయన విద్వాన్‌ పరీక్షకు (1938) హాజరైనప్పుడు తాను రచించిన ఈ కావ్యాన్ని చదువుకోవలసి వచ్చింది. అయితే ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం నుంచి వచ్చిన రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలుపెట్టి ఆ ఒక్క జవాబే 40 పేజీలు రాస్తూ ఉండిపోవడంతో సమయం సరిపోలేదు. దీంతో పరీక్ష తప్పారు. పుట్టపర్తి వారి కావ్యాల్లో మరో ఆణిముత్యం ‘షాజీ’. ఈ కావ్యాన్ని తన తొమ్మిదవ ఏటనే రాశారు.

దీన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. అరవిందయోగి రాసిన ఆంగ్లగ్రంథాల్లో ఎనిమిదింటిని తేటతెనుగులో అనువదిం చారు. వీటిలో ‘గీతోపన్యాసాలు’, ‘తలుపులు–మెరుపులు’ ముఖ్యమైనవి. విశ్వనాథ సత్యనారాయణ రచన ఏకవీర నవలను మలయాళంలోకి అనువదించారు. హృషికేష్‌లో ఆయన ప్రతిభా వైదుష్యానికి ముగ్ధుడైన శివానంద సరస్వతి ఆయనకు సరస్వతీపుత్ర బిరుదునిచ్చి సత్కరించారు. 1974లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది. తెలుగు సాహిత్య వినీలాకాశంలో నారాయణాచార్యులు ధ్రువతారగా నిలుస్తారు. ఆ మహానుభావుడు 1990 సెప్టెంబర్‌ 1న ఈ ప్రపం చం నుంచి నిష్క్రమించారు. 
(నేడు పుట్టపర్తి నారాయణాచార్యులు
105వ జయంతి సందర్భంగా)
వాండ్రంగి కొండలరావు, స్వతంత్ర జర్నలిస్టు, పొందూరు మొబైల్‌ : 94905 28730

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement