Jaya B: దర్శకురాలిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర | Jaya B 61st Birth Anniversary Special Story | Sakshi
Sakshi News home page

Jaya B: జర్నలిస్ట్‌ నుంచి దర్శకత్వం వరకు.. టాలీవుడ్‌లో తనదైన ముద్ర!

Published Sat, Jan 11 2025 6:44 PM | Last Updated on Sat, Jan 11 2025 6:52 PM

Jaya B 61st Birth Anniversary Special Story

మహిళా దర్శకురాలు బి.జయ జయంతి నేడు

టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పని చేసే మహిళలు చాలా తక్కువ మందే ఉన్నారు. తమదైన టాలెంట్‌తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన మహిళలను వెళ్లపై లెక్కించొచ్చు. అలాంటి వారిలో బి.జయ ఒకరు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. దర్శకురాలిగా మారి  చంటిగాడు,గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన బి. జయ జయంతి నేడు(జనవరి 11). ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ(1964). చెన్నయ్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్‌ లిటరేచర్‌), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.

అదే సమయంలో ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా, పి.ఆర్‌.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు.

సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్‌ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్‌హిట్‌ ఫ్రెండ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బి.జయ.

బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్‌ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement