puttaparty
-
పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి అర్బన్: అడ్డుగా వచ్చిన నాగుపామును రక్షించబోయి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కారుకు ప్రమాదం జరిగిన ఘటన పుట్టపర్తి మండలం కంబాలపర్తి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. కంబాలపర్తి గ్రామం దాటగానే పొలాల్లో నుంచి పెద్ద నాగుపాము కారుకు అడ్డుగా వచ్చింది. డ్రైవర్ షడన్‌గా బ్రేక్ వేశాడు. వెనుక కాన్వాయ్‌లో వస్తున్న మరో కారు ఎమ్మెల్యే కారును ఢీకొంది. ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్‌లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. చదవండి: (Express Highway: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..) -
కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు కలిసి తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీ సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పుట్టపర్తి అభివృద్ధికి స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలియజేశారు. -
ఆరోపణలు నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా
సాక్షి, పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పల్లె రఘునాథరెడ్డి మతిభ్రమించి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా..లేదంటే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన పేపర్‌క్లిప్పింగ్ తీసుకొని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అపద్ధాలు చెప్పడంలో దిట్ట అని, అవగాహన లేకుండా తాను జగన్మోహన్రెడ్డి బినామీ అని, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌నాయుడు తన వల్లే ఉద్యోగం పోయిందని ఆరోపణలు చేయడంలో వాస్తవం లేదన్నారు. దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. 1997లో కక్షసాధింపుగా అతన్ని తొలగించాలని చూస్తే భాస్కర్‌నాయుడును తానే కాపాడానని అన్నారు. పుట్టపర్తి అభివృద్ధి పేరిట దోపిడీ పుట్టపర్తి అభివృద్ధి పేరిటరూ. 200 కోట్లు దోచుకున్న విషయం మీది అని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి రాగానే పిల్ల కాలవల జీవో రద్దు చేసి, 2013 భూసేకరణచట్టం ప్రకారం పెద్దకమ్మవారిపల్లి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా అనంతపురం రైతులకు సాగు నీరు ఇవ్వకుండా కుప్పానికి హంద్రీనీవా కాలువ ద్వారా తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కోడ్‌కు విరుద్ధంగా అర్ధరాత్రి నాయకులను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పల్లెకే చెల్లిందన్నారు. అధికారం ఉన్న ఐదేళ్లూ నిద్రపోయి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.3200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేశానని చెప్పి, ఓటర్లను మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. పల్లె గిమ్మిక్కులకు మోసం పోయే పరిస్థితులో ప్రజలు లేరన్నారు. కార్యక్రమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మాధవరెడ్డి, గంగాద్రి, అవుటాల రమణారెడ్డి, ఏవీ రమణానెడ్డి, తిప్పన్న, శివప్ప, బిల్డర్శివ, జ్యోతికేశవ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
మీ దగ్గరున్న సెల్ఫోన్లు నేనిచ్చినవే
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ‘‘మీ దగ్గర ఉన్న సెల్ఫోన్లు నేనిచ్చినవే...హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.. బంగారు గుడ్లు పెట్టే విధంగా చేశాను..35 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు...జేబులోనుంచి రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని నిర్మించా..మీరంతా అండగా ఉండి ఆశీర్వదిస్తే అమరావతిని అభివృద్ధి బాట పడిస్తా’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగలో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని నమ్మక ద్రోహం చేశారన్నారు. రూ.లక్ష కోట్లు కొట్టేసిన మోదీ...మన వాటా ఇవ్వకుండా రూ.500 కోట్ల భిక్షం వేశానంటున్నారు. నాకు అవసరం లేదు...కావాలంటే నేనే ఆయనకు రూ.500 కోట్లు భిక్షం వేస్తానన్నారు. ఇక మన లా అండ్ ఆర్డర్‌పై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. 24 గంటలు కష్ట పడతానని...సంపద సృష్టించి చూపుతాన్నారు. పుట్టపర్తిని తీర్చిదిద్దుతా రాబోయే రోజుల్లో పుట్టపర్తిని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 139 చెరువులకు నీళ్లు పారిస్తానంటూ గతంలో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చారు. బుక్కపట్నం చెరువు ముంపు భూములకు పరిహారం ఇస్తామన్నారు. పుట్టపర్తిలో జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయిస్తానన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని బ్రాహ్మణులకు, వడ్డెరలకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉదయం 10 గంటలకు పుట్టపర్తికి చేరుకోవాల్సిన సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు రాగా జనం వేచి చూస్తూ అలసిపోయారు. -
'కమ్మ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలి'
అనంతపురం : మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి మండలాధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటా మూకుమ్మడి రాజీనామాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మంత్రి పదవి పొందిన పల్లె రఘునాథరెడ్డి ఎంపీపీ పదవుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం సరిగా లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, కార్యకర్తలను నిరాదరణకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక సంస్థల పదవులు టీడీపీలో పెద్ద దూరామాన్నే లేపాయనే చెప్పవచ్చు.