మంథనిని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి
మంథని అసెంబ్లీని విభజించి ఇతర జిల్లాలకు కలపడం తగదు
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్ : మంథని పట్టణ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. మంథని అసెంబ్లీ నియోజక వర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాలో కలపాలనే ఆలోచన సరికాదని అన్నారు. విశాలమైన మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం ప్రాంతం ప్రస్తుత జిల్లాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రకృతివనరులు, బొగ్గు, నీరు, అటవీ ప్రాంతం, ఆధునిక వ్యవసాయం, విద్యు^è ్ఛక్తి లాంటివి అందుబాటులో ఉన్నాయన్నారు. మంథని పట్టణం ఆధ్యాత్మికతకు నిలయమని పేర్కొన్నారు. చాలా రోజులుగా మంథని జిల్లా కోసం విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ అమలు నోచుకోలేకపోయిందని అన్నారు. మంథని పట్టణంలో బస్సుడిపో, జేఎన్టీయూ, ఇంజినీరింగ్ కళాశాల, సబ్కోర్టుతో పాటు తదితర కార్యాలయాలు 30 సంవత్సరాల క్రితమే రెవెన్యూ డివిజన్ ఉందని గుర్తు చే శారు. ముత్తారం మండలం లద్నాపూర్, మల్హర్ మండలం తాడిచెర్ల ప్రాంతంలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలోని ప్రస్తుత జిల్లాలకు సాగునీరందించే మేడిగడ్డ ప్రాజెక్టుతోపాటు, దక్షిణకాశీగా పేరొందిన కాళేశ్వరం దేవస్థానం, తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు, అటవీ సంపద, సిమెంట్ కర్మాగారాలు, బొగ్గు వనరులు కలిగి ఉండి భవిష్యత్తులో ఏర్పడే 27 జిల్లాల్లో కూడా మంథని తలమానికంగా ఉంటుందని తెలిపారు. మంథని పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని, మంథని అసెంబ్లీ నియోజక వర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాల్లో కలపాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని లేఖలో వివరించారు.