‘వంద గొంతులు ఒక్కటై..’
గుంటూరువెస్ట్ : తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అగ్రహారాల నుంచి పల్లెలకు తీసుకువచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందని ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. సాహిత్యం సామాన్యుడిదని వెలుగెత్తిచాటాడని, ఆయన సాహిత్యం, కవిత్వం విశ్వజనీయమని ఇనాక్ కొనియాడారు. గుర్రం జాషువా 120వ జయంతోత్సవం సందర్భంగా జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో గుంటూరులోని పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం ‘వంద గొంతులు ఒక్కటై.. జాషువా కోసం’ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ తెలుగు కవితా ప్రపంచం జాషువాను స్మరించుకోకుండా ఉండలేదన్నారు. ఆయనను స్మరించుకోవడం అంటే మన ఉనికిని మనమే గుర్తుంచుకోవడమని పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లో జాషువా పుస్తకాలు
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, కార్యక్రమ నిర్వాహకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో జాషువా పుస్తకాలు ఉంటేనే ఆయనను గౌరవించినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. నూతన రాష్ట్రంలో తెలుగు సాహిత్యాన్ని, భాషను నిలుపుకోవడం జాషువా రచనలు ద్వారానే సాధ్యమన్నారు. తెలుగు సాహిత్యం, తెలుగు వాళ్ల మధ్య ఐక్యత రావటానికి జాషువా రచనలు దోహదం చేస్తాయన్నారు.
గుంటూరు జిల్లాకు జాషువా పేరు
ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకుడు, కవి డాక్టర్ కత్తి పద్మారావు పంచకవుల కంటే జాషువా గొప్పవాడని కొనియాడారు. జాషువా విశ్వకవి అని, ఆయన పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్లు చల్లపల్లి స్వరూపరాణి, సంజీవరావు(శిఖామణి) మాట్లాడుతూ జాషువా రచనలను ఇంగ్లీష్, హిందీ బాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సాహిత్యానికి జాషువా ప్రాణం పోశారని అన్నారు.
తరలివచ్చిన కవులు..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన కవులు జాషువాపై రచనలను చదివి సభికులను ఉర్రూతలూగించారు. జాషువా రచనల గొప్పతనాన్ని, తెలుగుభాషకు ఆయన చేసిన సేవలు, ఆయన ఔనత్యాన్ని స్పురించే విధంగా ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఆహ్లాదపూరితంగా కొనసాగింది. ప్రముఖ కవులు ఎండ్లూరి సుధాకర్, కోయి కోటేశ్వరరావు, వి.సాంబశివరావు, ఎలీషా, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు(వెకై), సాహితీవేత్త బొమ్మిడాల కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, దశరథ్, పాలేటి జాన్సన్, పెద్దింటి యోహాను తదితరులు పాల్గొన్నారు. తొలుత నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కవులకు శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రజానాట్య మండలి కళాకారులు గని, పివి రమణ బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.