కరోలినాకు సింధు షాక్
ఒడెన్స్:భారత షట్లర్, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు డెన్మార్క్ ఓపెన్ లో మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ , రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) కు షాకిస్తూ ఫైనల్ కు చేరింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సింధు 21-15, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ ను గెలుచుకున్న సింధు, రెండో సెట్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో కరోలినాపై సింధు పోరాడి గెలిచింది. ఒక గంట 14 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుని ఫైనల్ రౌండ్ కు చేరింది. దీంతో సింధు తన ముఖాముఖి రికార్డు 2-3 గా మెరుగుపరుచుకుంది.
అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19 తేడాతో మాజీ నంబర్ వన్ వాంగ్ యిహాన్ (చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. సింధు తన తుదిపోరులో చైనా క్రీడాకారిణి, 2012 ఒలింపిక్ చాంపియన్ లి యురేయితో తలపడనుంది.