సమష్టి కృషితోనే స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట
గుంటూరు రేంజి ఐజీ సునీల్‌కుమార్
నెల్లూరు (అర్బన్): ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజి ఐజీ పీవీ.సునీల్‌కుమార్ అన్నారు. ‘కర్బింగ్ ఆఫ్ శాండర్స్ స్మగ్లింగ్- ఏ నీడ్ ఆఫ్ ది హవర్’ అనే అంశంపై ఎస్పీ సెంథిల్‌కుమార్ అధ్యక్షతన నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శనివారం సెమినార్ నిర్వహించారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ స్మగ్లింగ్‌ను అరికట్టే విషయంలో పురోగతి గణనీయంగా ఉందన్నారు.
స్మగ్లింగ్‌ను అరికట్టడాన్ని సీఎం చంద్రబాబు ప్రాధాన్యతా అంశంగా పెట్టుకున్నారని, ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజాహిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే సవాళ్లును ఎలా అధిగమించాలో పరిశీలించాలన్నారు. ఇది అయ్యేది కాదు... మనం ఏం చేయలేం అనే ఆలోచలను పక్కన బెట్టాయాలని సూచించారు. తమిళనాడు కూలీలు రాకుండా ఏం చేయాలో అనేదానిపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నట్లు చెప్పారు.
కలెక్టర్ ఎం.జానకి మాట్లాడుతూ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు జిల్లాలో మంచి టీం ఉందన్నారు. ఇప్పటికే స్మగ్లింగ్‌ను చాలా వరకు తగ్గించారన్నారు. జిల్లా అడిషనల్ జడ్జి ఆనంద్ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలంటే అధికారులకు ఇలాంటి సెమినార్లు ఎంతో అవసరమన్నారు. ఇవి జరిగినప్పుడే స్మగ్లింగ్ చేసే వాళ్లకు అధికారులు నివారణకు చర్యలు తీసుకుంటున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. పోలీసులు జ్యుడిషియల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే వివరాలపై, అలాగే పీడీ యాక్టుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అమాయకులపైన గ్రామస్తులను స్మగ్లింగ్‌ను వాడుకుంటున్నారని వారు ఇందులోకి రాకుండా ఉండేందుకు సరైన అవగాహన అవసరమన్నారు.
ప్రదర్శనను పరిశీలించిన ఐజీ:
సెమినార్ ఆవరణ బయట పోలీసులు అడవిలో కూంబింగ్ ఎలా నిర్వహించారు? ఎర్ర చందనం చెట్లు ఎలా ఉంటాయి? అనే విషయాలపై ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎర్రచందనంతో తయారు చేసిన కొన్ని వస్తువులను ప్రదర్శనలో పెట్టారు. సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గుంటూరు సర్కిల్ పీవీ చలపతిరావు, జైళ్ల శాఖ డీఐజీ జి.జయవ ర్ధన్, ఏఎస్పీ ఆర్.గంగాధరరావు పాల్గొన్నారు.