శాఖాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ఆమనగల్లు, న్యూస్‌లైన్:
శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని, అందరం కలిసి శాఖాహార ప్రపంచాన్ని సృష్టిద్దామని ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షీ సుభాష్ ప త్రీజీ అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో ధ్యాన మహా సభలు ఆరో రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పత్రీజీ వేణుగానంతో ప్రాతఃకాల అ ఖండ ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన ధ్యానులను ఉద్దేశించి ప్రసంగి స్తూ సమాజంలో మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నా... శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే శాకాహారమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. శాఖాహారం అమృత ఆహారమని, ఆరోగ్యానికి మణిహారం అని అన్నారు.
అహింస ద్వారానే ధర్మం, ధర్మం ద్వారానే ఆరోగ్యం, నిత్య సంతోషం ఉంటుందన్నారు. ప్రపంచాన్ని శాఖాహారమయంగా మారుద్దామని, ప్రతిచోటా పిరమిడ్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. మనలో ఉన్న భ్రమలను తొలగించుకోవడమే ఆధ్యాత్మికమని చెప్పారు. అనంతరం స్పిరిచ్యువల్ ఇండియా అనే మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మారెల్ల శ్రీరామకృష్ణ, పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు లక్ష్మణ్‌రావు, దామోదర్‌రెడ్డి, నందా ప్రసాద్‌రావు, నిర్మల, సాంబశివరావ్, రవిశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వరంగల్‌కు చెందిన రంజిత్ బృందం పేరిణి శివతాండవం, ముంబైకి చెందిన బింద్రా కారుల్కర్ హిందూస్థానీ భజన ఆకట్టుకున్నాయి.