Qantas Airways
-
న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల జర్నీ
సిడ్నీ : ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల ప్రయాణం అనంతరం సుదూర తీరానికి చేరుకున్న తొలి నాన్‌స్టాప్ ప్యాసింజర్ ఫ్లైట్‌గా ఖంటాస్ క్యూఎఫ్7879 అరుదైన ఘనత సాధించింది. న్యూయార్క్ నుంచి సిడ్నీకి 19 గంటల 16 నిమిషాల ప్రయాణం అనంతరం ఈ నాన్‌స్టాప్ ఫ్లైట్ ఆదివారం సిడ్నీలో ల్యాండ్ అయింది. లండన్ నుంచి సిడ్నీకి సైతం నాన్‌స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్‌పై ఖంటాస్ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. అమెరికా, బ్రిటన్ నుంచి ఆస్ర్టేలియాకు ఈ విమానయాన సంస్థ మారథాన్ రూట్లలో రెగ్యులర్ విమాన సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. కేవలం 49 మంది మందితో బోయింగ్ 787-9 విమానం ఇంధనం తిరిగి నింపుకునే అవసరం లేకుండా 16,000 కిలోమీటర్లుపైగా ప్రయాణించి న్యూయార్క్ నుంచి సిడ్నీకి చేరుకుంది. ఇది తమ విమానయాన సంస్థతో పాటు ప్రపంచ విమానయాన రంగంలోనూ చారిత్రక ఘట్టమని ఖంటాస్ సీఈవో అలన్ జోస్ అభివర్ణించారు. భిన్న టైమ్‌జోన్స్‌ను దాటి ప్రయాణీకులు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ప్రయాణీకులు, విమాన సిబ్బందిపై జెట్‌ల్యాగ్ ప్రభావానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖంటాస్ రెండు ఆస్ర్టేలియన్ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకుంది. ఖంటాస్ గత ఏడాది ఆస్ర్టేలియాలోని పెర్త్ నుంచి లండన్‌కు తొలి డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టగా 17 గంటల ప్రయాణంతో కూడిన ఈ విమానమే ప్రపంచంలోనే లాంగెస్ట్ పాసింజర్ విమానంగా నమోదైంది. -
ఆ విమానంలో జిమ్, పబ్..
న్యూయార్క్ : ప్రపంచంలో ఓ మూల నుంచి ఇంకో మూలకు 20 గంటల్లో చేరుకునేలా నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టేందుకు కాంటాస్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఎయిర్‌బస్, బోయింగ్‌లను ఒప్పించింది. సిడ్నీ నుంచి నేరుగా లండన్ లేదా న్యూయార్క్‌లకు పెద్దసంఖ్యలో ప్రయాణీకులను చేరవేసేలా నాన్ స్టాప్ ఫ్లైట్‌ను రూపొందించాలని ఏడాది కిందట బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు తాము విసిరిన సవాల్‌ను అవి స్వీకరించాయని కాంటాస్ సీఈఓ అలన్ జోస్ స్పష్టం చేశారు. తాము కోరుకున్న విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే స్థితిలో బోయింగ్, ఎయిర్‌బస్‌లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు సన్‌రైజ్ పేరుతో ఈ భారీ విమానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో కాంటాస్ నిమగ్నమైంది. మూడు వందల మంది ప్రయాణీకులను వారి లగేజ్‌లతో సహా సుదీర్ఘ గమ్యస్ధానాలకు చేరవేసేందుకు అనువుగా ఉండే ఈ విమానంలో ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు అవసరమైన ఇంధనం ఉంటుందని, ఈ విమానంలో చైల్డ్ కేర్ సదుపాయాలు, జిమ్,బార్, స్లీపింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచుతారని కాంటాస్ తెలిపింది. ఈ భారీ విమానంపై ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌లు సిడ్నీ సందర్శించాయి. కాగా ఈ భవిష్యత్ విమానాలకు సంబంధించి వచ్చే ఏడాది ఆర్డర్ ఇచ్చేందుకు జోస్ సన్నాహాలు చేస్తున్నారు. కాంట్రాక్టు కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లు పోటీపడుతుండటంతో కోరుకున్న ధర, డిజైన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కాంటాస్కు లభించింది. తాము 2022 నాటికి ఈ తరహా తొలి విమానాన్ని అందుబాటులోకి తెస్తామని జోస్ చెబుతున్నారు. -
ఖంటాస్ ఎయిర్వేస్ కు ఫోరం మొట్టికాయ
న్యూఢిల్లీ: ప్రయాణికుల లగేజీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖంటాస్ ఎయిర్వేస్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేసింది. ప్రయాణ సమయంలో లగేజీ పోవడానికి కారణమైనందుకు రూ. 75 వేలు జరిమానా విధించింది. గుర్గావ్ కు చెందిన నమ్రతా భార్గవ్, ఆమె భర్త అంకిత్ గలాటి- హనిమూన్ కు వెళుతూ ఖంటాస్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణించారు. వీరి లగేజీ నాలుగు రోజుల తర్వాత అందింది. దీనిపై ఫిర్యాదు చేయగా ఖంటాస్ ఎయిర్వేస్ తక్కువ మొత్తం ఇవ్వజూపింది. దీంతో వారు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. రూ. 50 వేలు నష్టపరిహారంతో రూ.25 వేలు కోర్టు ఖర్చుల కింద ఇవ్వాలని ఖంటాస్ ఎయిర్వేస్ ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.