ఎయిర్‌బస్ ఏ 350 (ఫైల్‌ఫోటో)
న్యూయార్క్ : ప్రపంచంలో ఓ మూల నుంచి ఇంకో మూలకు 20 గంటల్లో చేరుకునేలా నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టేందుకు కాంటాస్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ ఎయిర్‌బస్, బోయింగ్‌లను ఒప్పించింది. సిడ్నీ నుంచి నేరుగా లండన్ లేదా న్యూయార్క్‌లకు పెద్దసంఖ్యలో ప్రయాణీకులను చేరవేసేలా నాన్ స్టాప్ ఫ్లైట్‌ను రూపొందించాలని ఏడాది కిందట బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు తాము విసిరిన సవాల్‌ను అవి స్వీకరించాయని కాంటాస్ సీఈఓ అలన్ జోస్ స్పష్టం చేశారు.
తాము కోరుకున్న విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే స్థితిలో బోయింగ్, ఎయిర్‌బస్‌లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు సన్‌రైజ్ పేరుతో ఈ భారీ విమానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో కాంటాస్ నిమగ్నమైంది. మూడు వందల మంది ప్రయాణీకులను వారి లగేజ్‌లతో సహా సుదీర్ఘ గమ్యస్ధానాలకు చేరవేసేందుకు అనువుగా ఉండే ఈ విమానంలో ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు అవసరమైన ఇంధనం ఉంటుందని, ఈ విమానంలో చైల్డ్ కేర్ సదుపాయాలు, జిమ్,బార్, స్లీపింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచుతారని కాంటాస్ తెలిపింది.
ఈ భారీ విమానంపై ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌లు సిడ్నీ సందర్శించాయి. కాగా ఈ భవిష్యత్ విమానాలకు సంబంధించి వచ్చే ఏడాది ఆర్డర్ ఇచ్చేందుకు జోస్ సన్నాహాలు చేస్తున్నారు. కాంట్రాక్టు కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లు పోటీపడుతుండటంతో కోరుకున్న ధర, డిజైన్‌లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కాంటాస్‌కు లభించింది. తాము 2022 నాటికి ఈ తరహా తొలి విమానాన్ని అందుబాటులోకి తెస్తామని జోస్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment