భారత్‌లో బ్లాక్‌బెర్రీ జెడ్3
- ధర రూ. 15,990
- జులై 2 నుంచి మార్కెట్లోకి..
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్ బెర్రీ సంస్థ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ స్మార్ట్ఫోను ధర రూ.15,990లు. ఈ స్మార్ట్‌ఫోనును వచ్చే నెల 2 నుంచి విక్రయిస్తామని బ్లాక్‌బెర్రీ ఇండియా మెనేజింగ్ డెరైక్టర్ సునీల్ లాల్వానీ ఇక్కడ బుధవారం ప్రకటించారు. ఈ నెల 25 నుంచి జూలై 1వ తేదీ వరకు దేశంలోని అన్ని బ్లాక్‌బెర్రీ షోరూంలలో, ఫ్లిప్‌కార్ట్, మొబైల్ స్టోర్లలో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1.2 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్-కోర్ ప్రాసెసర్,1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని లాల్వానీ తెలి పారు. ఈ ఫోన్‌తో ఫైల్స్‌ను, ఫొటోలను, డాక్యుమెంట్లను వేగంగా షేర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో తామందిస్తున్న తొలి ఫోన్ ఇదని తెలిపారు.
ఈ ఫోన్‌తో పాటు బ్లాక్‌బెర్రీ మ్యాప్స్‌ను అందిస్తున్నామని వివరించారు. ఒక బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఈ బ్లాక్‌బెర్రీ మ్యాప్స్ యాప్‌ను అందించడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్లాగే ఈ యాప్ టుడెమైన్షనల్ మ్యాప్‌లను లోకల్ సెర్చ్, టర్న్-ైబె -టర్న్ వాయిస్ డెరైక్షన్లతో అందిస్తుందని వివరించారు. హిందీ, ఇంగ్లిష్ ప్రిడిక్టివ్ టైపింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు.
ఆఫర్లు..: కాగా ఈ-రిటైలింగ్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్, మొబైల్ స్టోర్లు ఈ కొత్త ఫోనుపై ఆఫర్లు ప్రకటించాయి. ముందస్తుగా ఆర్డర్ చేస్తే చేసుకుంటే వెయ్యి రూపాయిల ఓచర్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మరోవైపు మొబైల్ స్టోర్ కూడా జూలై 1వ తేదీలోపు బ్లాక్‌బెర్రీ జడ్3 స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేస్తే వెయ్యి రూపాయిల గిఫ్ట్ ఓచర్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారులకు 7.5 శాతం తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది.