వెండితెరకు సల్మాన్ జైలు జీవితం!
కండలవీరుడు సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీ నం. 210గా ఆయన శిక్ష అనుభవించారు. ఈ శిక్ష ఆధారంగా రంజిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఖైదీ నం.210’ చిత్రం ముంబయ్‌లో ఆరంభమైంది. సల్మాన్‌ని పోలినట్లుగా ఉండే ఉస్మాన్ ఖాన్ని టైటిల్ రోల్‌కి తీసుకున్నారు. సల్మాన్‌తో పాటు అప్పట్లో జైలులో ఉన్న మహేశ్ సైనీ అనే వ్యక్తి ఇందులో తన నిజజీవిత పాత్రను చేస్తున్నారు. సల్మాన్ జింకలను వేటాడిన సమయంలో ఆయన వాహనాన్ని నడిపిన డ్రైవర్ హరీష్ ధులానీని డ్రైవర్ పాత్రకు ఎంపిక చేశారు. ఆ వాహనాన్నే ఈ చిత్రంలో వాడనున్నారు. ఇది జీవిత చరిత్ర కాదు కాబట్టి ఎవరి దగ్గరా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ, సల్మాన్‌ని చెడ్డవాడిగా చూపించే చిత్రం కాదనీ దర్శకుడు తెలిపారు. కాగా, ఈ కేసుకి సంబంధించిన తుది తీర్పు ఈ నెల 25న వెలువడనుంది. ఆ తీర్పుతో ఈ చిత్రం ముగుస్తుందని ఊహించవచ్చు.