8 మందితో క్విక్ యాక్షన్ టీం ఏర్పాటు
అడవిదేవులపల్లి(దామరచర్ల): సూర్యాపేట కొత్తబస్టాండ్‌లో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రవాదుల సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా 8 మందితో క్విక్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని అడవిదేవులపల్లి గ్రామంలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాపోటీలు ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్విక్ యాక్షన్ టీంలోని సభ్యులు వెపన్స్‌తో నిరంతరం పహారాకాస్తూ శాంతిభద్రతలను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామా ల్లో శాంతి భద్రతలతో పాటు ప్రజలు ఎదుర్కొనే అన్నిరకాల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామ పోలీసు అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో నాటుసారా, దొమ్మీలు అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో జనమైత్రి సంఘాలతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం పోలీసుశాఖ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనవెంట రూరల్ సీఐ నరింహారెడ్డి, జందార్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ పాల్గొన్నారు.