సత్వర సేవలు అందిస్తున్నాం : డెప్యూటీ ఈవో
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు వచ్చే భక్తులు వేచి ఉండే సమయం లేకుండా సత్వర సేవలందిస్తున్నట్లు కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం తిరుమలలోని మీడియా సెంటర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 590మంది ఉద్యోగులతోపాటు 879మంది కల్యాణకట్ట సేవకులతో కలసి మొత్తం 1469 మంది సిబ్బందితో కలసి తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట, 18 మినీ కల్యాణకట్టల్లో సేవలందిస్తున్నట్టు తెలిపారు.
దీంతో భక్తులు వేచి ఉండే సమయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తిరుమలలోని గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదిరోజులకు గాను 2,52,712 మంది తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది ఆరు రోజుల్లోనే 2,59,312 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించినట్టు వెల్లడించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అయ్యప్పమాల భక్తులు, గోవిందమాల భక్తులు, వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల నూతన సంవత్సరాది వంటి ప్రత్యేక సందర్భాలను దృష్టిలో పెట్టుకుని 2015 జనవరి వరకు కల్యాణకట్ట సేవకుల సేవలను వినియోగించుకోనున్నట్ట చెప్పారు.
యాత్రికుల వసతికి పెద్దపీట
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు టీటీడీ పెద్దపీట వేసిందని రిసెప్షన్ డెప్యూటీ ఈవో ఆర్1 వెంకటయ్య తెలిపారు. తిరుమలలో మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో తిరుమలలోని 6,683 గదుల్లో వసతి కల్పించినట్లు తెలిపారు.
ఈ మేరకు ఆరు రోజుల్లో రూ.1,06,74,660 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఆరు రోజులకు రూ.70,02,040 ఆదాయం వచ్చిందన్నారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించటానికి వచ్చిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, సేవకులు, టీటీడీ సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వసతిని కల్పించామన్నారు.