సరైన న్యాయం జరగాలి
- నిర్లక్ష్యంతోనే బియాస్ దుర్ఘటన
- అవగాహన వాక్‌లో మృతుల తల్లిదండ్రులు
- బియాస్ ఘటనకు ఏడాది పూర్తి
ఖైరతాబాద్: బాధితులకు సత్వర న్యాయం జరిగినప్పుడే మాలాంటి కడుపుకోత మరే కుటుంబానికి రాకుండా ఉంటుందనే ఆశతోనే మౌన పాదయాత్ర నిర్వహించినట్లు బియాస్ దుర్ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు తెలిపారు. బియాస్ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నోటికి నల్ల వస్త్రం కట్టుకొని పాదయాత్ర నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి మృతిచెందిన విద్యార్థులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ పిల్లలను తలచుకొని కన్నీరుమున్నీరయ్యారు.
ఇది ముమ్మాటికి క్రిమినల్ నెగ్లిజెన్సీ వల్ల జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటా విద్యార్థులను టూర్‌కు తీసుకెళుతున్న ప్రతి కళాశాల, విద్యాసంస్థలను ప్రభుత్వం గుర్తించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిలో అవగాహన కల్పించాలన్నారు. వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ పేరుతో హిమాచల్‌ప్రదేశ్ వెళ్లి గత సంవత్సరం జూన్ 8న సాయంత్రం 6.30 గంటలకు బియాస్‌నదిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..
పీపుల్స్‌ప్లాజాలో సెలైంట్ వాక్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన తల్లిదండ్రులు తమ తమ పిల్లలను ఫొటోలో చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కళాశాల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయి తమకు తీరని బాధను మిగిల్చారని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వాక్ ప్రారంభానికి ముందు కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బరువెక్కిన హృదయాలతో నిండిపోయింది.
భద్రత చర్యలు పాటించలేదు
కళాశాల నిర్లక్ష్యంతోనే మా అబ్బాయిని కోల్పోయాం. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న నిబద్ధత పిల్లల భద్రత విషయంలో పాటించలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా కళాశాల యాజమాన్యం తమకేమి పట్టనట్లు ఉంది.
- బి.రిత్విక్ బంధువు
పట్టించుకోవడం లేదు
సత్వర న్యాయం జరగడం లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినప్పుడు మాత్రమే మరుగున పడిన సంఘటనలు తెరమీదకు వస్తాయి. ఆ తరువాత అటు ప్రభుత్వం, ఇటు కళాశాలలు పట్టించుకోవు. మాకు న్యాయం చేసే వారే కరువయ్యారు.
- ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి
క్రిమినల్ నెగ్లిజెన్సీ..
క్రిమినల్ నెగ్లిజెన్సీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చట్టాల్లో మార్పులు రావాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే తీర్పువెలువడినప్పుడే మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది.
- కె.ప్రసాద్
ఐక్యత కోసమే వాక్
భావిభారత పౌరుల సంక్షేమాన్ని మరిచి చేతులారా చంపేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, కళాశాల నిర్లక్ష్యం. ఈ వాక్‌తో రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ప్రజల్లో ఐకమత్యం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవాలి. - గోపీకృష్ణ