అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?
ప్రపంచంలోని వివిధ దేశాలలోని ప్రజల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రజల జీవనశైలి, పని విధానంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రజల జీవితకాలం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని ప్రజలు అధికకాలం జీవిస్తుండగా, మరికొన్ని దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. అమెరికాకు సంబంధించి ఒక నూతన నివేదిక పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. అమెరికాలో గత 100 సంవత్సరాలతో పోలిస్తే, ప్రజల సగటు వయస్సులో క్షీణత చోటుచేసుకున్నదని తేలింది.
ఈ రిపోర్టు ప్రకారం చూస్తే అమెరికన్లు గతంతో పోలిస్తే ఇప్పుడు త్వరగా చనిపోతున్నారు. పరిశోధకులు తెలియజేసిన విషయాలను బీబీసీ ప్రపంచం ముందు ఉంచింది. అమెరికాలో పేదల సగటు వయసు తగ్గిందని పరిశోధనల్లో తేలింది. నల్లజాతి అమెరికన్ల జీవితకాలం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. సమాజంలోని అసమానతలు వయస్సుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
అమెరికన్ల సగటు జీవితకాలం క్షీణించడానికి అనేక కారణాలను దానిలో తెలియజేశారు. ఇందుకు వ్యాధులతో పోరాటం, ఔషధాలు నుంచి ఆయుధాల వరకు అన్నీ బాధ్యతవహిస్తున్నాయి. సామూహిక కాల్పుల ఘటనలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు.
ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి, ఇతర వ్యాధుల కారణంగా, చిన్న వయస్సులోనే మరణాలు సంభవించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న అసమానతలు, మారణాయుధాల వినియోగం, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని స్పష్టమయ్యింది.
ఇది కూడా చదవండి: సింగపూర్‌కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ