చెల్లి నష్టపోయింది..
పటేళ్లకు ప్రత్యేక రిజర్వేషన్ పేరిట గుజరాత్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న హార్దిక్ పటేల్ తన ఆగ్రహానికి, ఆవేశానికి నిర్మాణాత్మక వివరణ ఇస్తున్నారు. తన సోదరి స్కాలర్ షిప్ విషయంలో జరిగిన అన్యాయం.. దేశంలో రాజకీయ లబ్ధిమాటున అమలవుతున్న రిజర్వేషన్లకు తార్కాణంగా నిలిచిందని, తన ఆగ్రహానికి, ఆవేశానికి అదో కారణమని చెప్తున్నారు. దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో సుమారు సగానికి పైగా ప్రభుత్వోద్యోగాలు, కాలేజీల్లో అవకాశాలు వెనుకబడిన కులాలు, తెగలకే చెందడం...కుల, మత ప్రాతిపదికన అమలయ్యే కోటాలతో ఆర్థికంగా వెనుకబడ్డవారికి అన్యాయం జరగడాన్ని హార్దిక్ ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్ లోని వ్యవసాయ గ్రామాల్లో పటేళ్ల సగానికి పైగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని.. దేశంలో కులాన్ని, మతాన్ని బట్టి ఏర్పరచిన కోటా వ్యవస్థలో వీరంతా తీవ్రంగా నష్టపోతున్నారని హార్దిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో హార్దిక్ యువ పటేళ్లతో ఓ నెట్ వర్క్ ఏర్పరచుకున్నారు. తన డిమాండ్ తో గుజరాత్ నలుమూలల నుంచి సుమారు పది మిలియన్ల వరకూ పటేళ్ల సహా 63 మిలియన్ల ప్రజలను ఆకట్టుకున్నారు.
ఫామ్ హౌస్ లు, రెస్టారెంట్లలో సమావేశాలతోపాటు, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా యువత మద్దతును పొందారు. తనకున్న మద్దతుతో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. కోటా వ్యవస్థతో ఎందరో యువత సాయం అందక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న పరిస్థితి నెలకొందని, దేశంలో ఓట్లకోసం నాయకులు కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ లబ్ధి పొందుతున్నారని, ఏళ్ళదరబడి రాజకీయాల్లో విజేతలుగా నిలవడమే వారి ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
గుజరాత్ లో సంపన్నవర్గాల జాబితాలో ఉన్న పటేళ్లు.. దేశంలో రాజకీయ లబ్ధికోసం అమలవుతున్న కోటా వ్యవస్థను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి రిజర్వేషన్లతో ఎంతోమంది నష్టపోతున్నారంటూ విరుచుకు పడుతున్నారు. కోటా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ లో పవర్ ఫుల్ గా ఉన్న పటేళ్లు ప్రత్యేక కోటాను సాధించగలిగితే ఇక మీదట దేశంలోని ప్రతి కులంవారు కోటాకు అర్హులయ్యే అవకాశం ఉంది.
కేవలం ఒక్క నెలముందు ఎక్కువశాతం మంది హార్దిక్ పటేల్ పేరుకూడ విని ఉండరు. కానీ నేడు గుజరాత్ లోనే కాదు, దేశంలో హార్దిక్
పేరు మారుమోగుతోంది. మేం అడుక్కోవడం లేదు.. నిజం మాట్లాడుతున్నాం అనే హార్దిక్ నినాదానికి యువత ముక్త కంఠంతో మద్దతు పలుకుతోంది. హార్దిక్ కు లభిస్తున్న అనూహ్య స్పందనకు దేశరాజకీయరంగమే విస్తుపోతోంది. కనీసం ప్రైవేట్ సెక్టార్లలో కూడ ఉద్యోగాలు దొరకని విద్యావంతులు, నిరుద్యోగులు హార్దిక్ విధానాలకు మద్దతు పలుకుతున్నారు. 2001 లో గుజరాత్ ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, గజరాత్ మోడల్ గా గుర్తింపు పొంది, 2014 లో ప్రధాని పదవిని సైతం కైవసం చేసుకున్న నరేంద్ర మోదీకి సైతం.. హార్దిక్ విధానాలు చూస్తే గొంతులో వెలక్కాయ చందంగా తయారైంది.