R and B officials
-
బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది
సాక్షి, బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది. బోథ్ మండలకేంద్రం నుంచి రఘునాథ్‌పూర్ మీదుగా అడెల్లి దేవస్థానానికి రోడ్డు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇచ్చిన హామీలు కలలుగానే మిగిలాయి. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. పూర్తవుతుందనుకున్న రోడ్డు పూర్తి కాలేదు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తామని నాయకులు మళ్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించాయి. గతంలో అటవీ అనుమతులు లభించినా ఆర్అండ్బీ అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధుల అలసత్వం తో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో విఫలయ్యారు. దీంతో రోడ్డు పనుల అనుమతులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన స్టేజ్ వన్ అటవీ అనుమతులు జారీ చేసింది. దీంతో రోడ్డు పనులకు అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆర్ అండ్‌బీశాఖ నుంచి నిధులు ఇవ్వడంలో విఫలమవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మొదటిదశ అనుమతులు మంజూరు. అడెల్లి రోడ్డు నిర్మాణానికి ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముం దు ప్రజాప్రతినిధులు రోడ్డు విషయమై పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత బోథ్ అటవీ రేంజ్ అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి కోసం జూన్ ఒకటో తేదీ, 2017న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణశాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించి 2017, ఆగస్టు 4వ తేదీన రోడ్డు నిర్మాణానికి పలు షరతులతో కూ డిన అనుమతులు మొదటి దశలో జారీ చేసింది. రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు భవనాలశాఖకు దాదాపు 4.67 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతోంది. అటవీశాఖ కోల్పోతున్న భూమి, చెట్లు ఆశాఖ వారు మరోచోట అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి అభివద్ధికి కావాల్సిన నిధులను రోడ్డు భవనాల శాఖ ఇవ్వాల్సి ఉంది. ఈ షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండోదశలో రోడ్డు భవనాలశాఖ అటవీ శాఖకు అవసరమగు నిధులు కేటాయిస్తే రెండోదశలో పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. కాగా రోడ్డు పనులకోసం ఇప్పటికే రూ.4 కోట్ల యాభై ఐదు లక్షలు మంజూరై ఉన్నాయి. దీంతో రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా అవసరమగు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న భారం... రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల మధ్య దూరం తగ్గనుంది. గతంలో అడెల్లి, సారంగాపూర్‌కు వెళ్లాలంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్డు పూర్తయితే బోథ్ సారంగాపూర్‌కు వెళ్లాలంటే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. గత ఇరవై ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రజలే డిమాండ్ చేశారు. మూడేళ్లక్రితం బోథ్ మండలంలోని కుచులాపూర్ వేంకటేశ్వర ఆలయం నుంచి రఘునాథ్‌పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు. -
హార్ట్ ఫౌండేషన్‌కు స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన క్వార్టర్స్‌లో అద్దె చెల్లించకుండా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి, ప్రైవేటుగా నడుస్తున్న హార్ట్ ఫౌండేషన్‌పై చర్యలు ప్రారంభమయ్యాయి. ‘అక్రమాలు చూస్తే హార్ట్ స్ట్రోకే’ శీర్షికన గత నెల 18వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను అద్దెకు తీసుకుని, అద్దె చెల్లించకుండా... ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా సొంతానికి ఫౌండేషన్ నడుపుతున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌండేషన్‌కు కేటాయించిన ఆరు క్వార్టర్స్‌ను వెంటనే స్వాధీనం చేయాలని ఫౌండేషన్ కార్యదర్శికి ఆర్అండ్బీ డీఈ కె. కృష్ణారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అద్దె వసూలు చేయకుండా మిన్నకుండిపోయిన ఆర్అండ్బీ అధికారులతో పాటు ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా తాఖీదులు జారీ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను ఫౌండేషన్ సొంతానికి వినియోగించుకున్నా పట్టనట్లు వ్యవహరించిన ఆర్అండ్బీ అధికారులకు తాఖీదులు అందినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్అండ్బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ : మరోవైపు హార్ట్ ఫౌండేషన్‌లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ బృందం కూడా విచారణ చేపట్టింది. ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఏ విధంగా ప్రైవేటుగా ఏర్పాటు చేసే హార్ట్ ఫౌండేషన్‌కు కేటాయించారు? అద్దె చెల్లించనప్పటికీ ఎందుకు మిన్నకుండిపోయారు? క్వార్టర్స్‌ను ఖాళీ చేయించాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు అనే ప్రశ్నలతో పాటు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ ఇచ్చిన అభివృద్ధి నిధులను సొంతానికి వినియోగించినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలో కూడా విజిలెన్స్ తాఖీదులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై కూడా సమాధానం ఇవ్వాలంటూ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆర్అండ్బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మిషన్‌లో వేగం పెంచండి
వికారాబాద్ అర్బన్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల వెంబడి పైపులైన్లు వేసేందుకు తవ్విన రోడ్లకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, గుంతలను వెంటనే పూడ్చి వేయాలని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరుకు పైపులైన్లు వేసి పనులు పూర్తి చేయాలని సూచించారు. రోడ్లు తవ్వే సమయంలో ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తనను సంప్రదించాలన్నారు. జాతీయ రహదారుల వెంట పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్‌బీ ఈఈ ప్రతాప్, జాతీయ రహదారి ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్ రావు, వాటర్ గ్రిడ్ ఈఈ నరేందర్, ఇరిగేషన్ ఈ ఈ చంద్రశేఖర్, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు. -
రాజీవ్ రహదారిలో ఇన్ని లోపాలా?
ఆర్అండ్బీ అధికారులతో సమీక్షలో కేసీఆర్ ఆగ్రహం ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయత లేకుండా నాలుగులేన్లుగా విస్తరణ, పెరిగిన వాహన ప్రమాదాలు, తీవ్రఅవినీతి.. తదితర ఆరోపణలు మూటగట్టుకున్న రాజీవ్హ్రదారిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్షించి లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. దీనిపై నివేదికను అందజేయాలన్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించిన ఈ హైవే ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కానీ విస్తరణ శాస్త్రీయంగా లేకపోవడమేగాక లోపభూయిష్టంగా ఉండడంతో వాహనదారుల పాలిట ఇది ప్రమాదకారిగా మారింది. విస్తరణ సమయంలోనే వివాదం తలెత్తడంతో అప్పటి సర్కార్ శాసనమండలి సభ్యులతో ఓ సభాసంఘాన్ని నియమించింది. నిర్మాణంలో లోపాలు నిజమేనంటూ ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆ ఫైలునే అధికారులు మాయం చేశారు. వీటిన్నింటిని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ ఆ లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. బై-పాస్‌లు.. క్రాసింగ్‌లు : సాధారణంగా నాలుగులేన్ల రహదారికి సర్వీసు రోడ్లు ఉండాలి. కానీ రాజీవ్ రహదారిపై అవి లేవు. దీనిపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.1400 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డుపై గ్రామాల వద్ద బై-పాస్‌లు నిర్మించకపోవడాన్ని ఆయన అధికారులను ప్రశ్నిం చారు. వేగంగావచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన కూడా ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే హైదరాబాద్- ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాల్సిందేనన్నారు. ప్రతి గ్రామం వద్ద బై-పాస్‌లు, పెద్ద గ్రామాలున్నచోట వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూసేకరణ చేయకపోవడం వల్ల బై-పాస్‌లను ఏర్పాటు చేయలేకపోయామని అధికారులు పేర్కొనగా, ఈసారి అది పూర్తిచేసి వాటి ని నిర్మించాలని సూచించారు. ఆరు ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా గుర్తింపు ప్రజ్ఞాపూర్, కుకునూర్‌పల్లి, దుద్దెడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండంలను ప్రమాదకరంగా ఉన్న ఆరు ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు అక్కడ బై-పాస్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే, అవి చాలవని, మరోసారి రోడ్డుమొత్తాన్ని తనిఖీ చేసి కచ్చితమైన లోపాలు గుర్తించి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే నగరంలోని ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని ఆదేశించారు.