డ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కు చెందిన క్వార్టర్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కు చెందిన క్వార్టర్స్‌లో అద్దె చెల్లించకుండా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి, ప్రైవేటుగా నడుస్తున్న హార్ట్ ఫౌండేషన్‌పై చర్యలు ప్రారంభమయ్యాయి. ‘అక్రమాలు చూస్తే హార్ట్ స్ట్రోకే’ శీర్షికన గత నెల 18వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను అద్దెకు తీసుకుని, అద్దె చెల్లించకుండా... ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా సొంతానికి ఫౌండేషన్ నడుపుతున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌండేషన్‌కు కేటాయించిన ఆరు క్వార్టర్స్‌ను వెంటనే స్వాధీనం చేయాలని ఫౌండేషన్ కార్యదర్శికి ఆర్‌అండ్‌బీ డీఈ కె. కృష్ణారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అద్దె వసూలు చేయకుండా మిన్నకుండిపోయిన ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా తాఖీదులు జారీ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను ఫౌండేషన్ సొంతానికి వినియోగించుకున్నా పట్టనట్లు వ్యవహరించిన ఆర్‌అండ్‌బీ అధికారులకు తాఖీదులు అందినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది.
విజిలెన్స్ విచారణ : మరోవైపు హార్ట్ ఫౌండేషన్‌లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ బృందం కూడా విచారణ చేపట్టింది. ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఏ విధంగా ప్రైవేటుగా ఏర్పాటు చేసే హార్ట్ ఫౌండేషన్‌కు కేటాయించారు? అద్దె చెల్లించనప్పటికీ ఎందుకు మిన్నకుండిపోయారు? క్వార్టర్స్‌ను ఖాళీ చేయించాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు అనే ప్రశ్నలతో పాటు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ ఇచ్చిన అభివృద్ధి నిధులను సొంతానికి వినియోగించినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలో కూడా విజిలెన్స్ తాఖీదులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై కూడా సమాధానం ఇవ్వాలంటూ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment