బీసీ బిల్లు కోసం దేశవ్యాప్త ఉద్యమం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టాలని తీర్మానించాయి. హైదరాబాద్లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో 26 బీసీ సంఘాలు, 12 రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, 18 బీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తమ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రాజకీయ రిజరేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయని గుర్తు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమించి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధిస్తామని కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, రాజు, వెంకన్న గౌడ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.