పోలీసు కస్టడీకి బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: పని మనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతిలను విచారించేందుకు స్థానిక కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాల్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు వీరి కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనకు ఓకే చెప్పింది. ఈ నెల ఐదున తమ ఇంటిలోని పనిమనిషి రాఖీ భద్ర మృతి కేసులో అరెస్టయిన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గ ఎంపీ ధనంజయ్, ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో దంత వైద్యురాలు జాగృతిల జ్యుడీషియల్ కస్టడీ పూర్తవడంతో శనివారం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వీరిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే వీరి వాదనలు విన్న కోర్టు రెండు రోజుల విచారణకు మాత్రమే అనుమతించింది. అయితే నవంబర్ ఒకటి, నాలుగు తేదీల మధ్యలో ధనంజయ్ ఢిల్లీలోనే లేరని ఆయన తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు. గత రెండేళ్ల నుంచి దక్షిణ ఆవెన్యూ 175లోనే ధనంజయ్ ఉండటం లేదన్నారు. ఇప్పటికే ఐదు రోజులు పాటు పోలీసులు విచారించారని, కావున మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిన అసరం లేదని వాదించారు.