చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా: సీఆర్
హైదరాబాద్: చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా పట్టుకుందని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. రాజధాని ఏర్పాటుపై ప్రత్యామ్నాయ మార్గాలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. నూజివీడులో 12 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం వచ్చే హెచ్చరికలున్నాయని వెల్లడించారు.
ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని పల్లెల్లో పొలాలు తగులబెట్టిన వారిని ఇప్పటివరకు గుర్తించలేదని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఖాకీల నీడలో భూసేకరణ జరుపుతూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. తులసిరెడ్డి, జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి, వి. లక్ష్మణ్ రెడ్డి తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.