ముంచుకొస్తున్న చీకట్లు!
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల ఇప్పటికే అధిక శాతం ఉత్పత్తి నిలిచిపోగా, నేటి ఉదయం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం నెలకొంది. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ అధ్యక్షుడు ఆర్ సాయిబాబా ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొంటారని తెలిపారు. సమ్మెలో అత్యవసర సేవలకు కూడా మినహాయింపు లేదన్నారు. దాంతో రాష్ట్రం దాదాపు విద్యుత్ సంక్షోభం వాకిట్లో నిలబడిన పరిస్థితి నెలకొంది.
సమ్మె ప్రభావం..
సమ్మె కారణంగా శనివారం వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీఎస్లో 1,050 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోగా, విజయవాడలోని వీటీపీఎస్‌లో 1,260 మెగావాట్లు, ఆర్టీపీపీలో 840 మెగావాట్లు, సీలేరు థర్మల్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సమైక్యవాదుల ముట్టడితో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)ను కాపాడేందుకు అనధికార కోతలను అధికారులు ప్రారంభించారు. దీనివల్ల సీమాం ధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలోనూ శనివారం ప్రజలకు విద్యుత్ కోతలు తప్పలేదు. హైదరాబాద్‌కు అందాల్సిన కోటా కూడా తగ్గడంతో రాజధానిలోనూ సుమారు 2 గంటలపాటు కోత విధించారు. ఇదిలా ఉండగా, సీమాంధ్రలోని ట్రాన్స్‌కో సిబ్బంది కూడా ఆది వారం నుంచి సమ్మె ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఉత్పత్తి జరుగుతున్న కొద్దోగొప్పో విద్యుత్తును కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొననుంది. మరోవైపు, జెన్కో, ట్రాన్స్‌కో సిబ్బంది సమ్మె కొనసాగిస్తామని ప్రకటించడంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఆదివారం 700 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సీమాంధ్రలో ప్రజలకు విద్యుత్ కష్టాలు పెరగనున్నాయి. విద్యుత్‌పై ఆధారపడిన తాగు, సాగునీటి అవసరాలకు విఘాతం కలగనుంది. ఎలాంటి సేవలు అందించబోమని విద్యుత్ జేఏసీ ప్రకటించడంతో.. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్రాల మరమ్మతు తదితర సేవలకు కూడా అంతరాయం కలగనుంది. దాంతో విద్యుత్ సరఫరాకు ఇబ్బం దులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, జెన్కో ఉన్నతాధికారుల వాదన మరో రకంగా ఉంది. ‘వీటీపీఎస్‌లో ఆదివా రం ఉదయం నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతారని చెబుతున్నారు. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం నాటికి విద్యుదుత్పత్తి నిలిచిపోయిన ఆరు యూనిట్ల ద్వారా 1260 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలమ’ని వారు తెలిపారు. మొత్తం మీద అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కూడా సరఫరా చేయలేకపోవడంతో కోతలు తప్పేలా లేవు. కాగా,ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి ట్రాన్స్‌కో, జెన్కో ఉన్నతాధికారులతో ఆదివారం అత్యవసరంగా సమావేశం కానున్నారు.
ఎన్టీపీసీలో నిండుకున్న బొగ్గు నిల్వలు.. మూతపడనున్న యూనిట్లు
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు నిల్వలు అడుగంటాయి. బొగ్గు కొరత మూలంగా 500 మెగావాట్ల 6వ యూనిట్‌ను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. మిగతా యూనిట్లలో తక్కువ లోడ్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కోల్‌యార్డులో 20 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉండగా, ఒక్కరోజుకు మాత్రమే సరిపోతుందని తెలుస్తోంది.
ప్లాంట్‌లో 200 మెగావాట్ల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల నాలుగు యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఏడు యూనిట్లలో పూర్థిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి ప్రతిరోజూ 30-35 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు అవసరం. సింగరేణి సంస్థ నుంచి రోజుకు 25-30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అవుతుండగా, ఏ రోజుకారోజే వినియోగిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సింగరేణి సంస్థలో సెలవు దినం కావడంతో బొగ్గు రవాణా నిలిపోయింది. దీంతో 6వ యూనిట్‌ను అధికారులు నిలుపుదల చేశారు. ఇవే పరిస్థితులు కొనసాగిన పక్షంలో ఒక్కొక్కటిగా మిగతా యూనిట్లను నిలిపివేసే అవకాశముంది. అధికారులు బొగ్గు దిగుమతి కోసం సమీక్షలు చేయడం తప్ప ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.