Rabi season Kharif crops
-
రబీ యాక్షన్ ప్లాన్ రెడీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రబీ కాలం ముంచుకొస్తోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. గతేడాది రబీసాగును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ ఈ రబీ సాగు ప్రణా ళికను విడుదల చేసింది. 2018–19లో 69,948 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధంగా ఉంచింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 22 టీఎంసీల నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ ద్వారా జిల్లాలో రబీకి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన సాగునీరు ఇచ్చేందుకు కూడా ప్రణాళికను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నవంబర్‌లో రైతులకు మరోమారు ‘రైతుబంధు’ రొక్కం చేతికందనుండగా, ఈసారి రబీ రైతులకు అనుకూలిస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ రబీ యాక్షన్ ప్లాన్ ఇదీ.. వ్యవసాయ శాఖ గత రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రబీ సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసింది. గతేడాది రబీలో 66,198 హెక్టార్లలో వివిధ పంటలు వేయగా. ఈసారి 69,948 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర తదితరు పంటలు వేస్తారని పేర్కొన్నారు. గత రబీలో 95 శాతం సాగు కాగా, ఈసారి నూటికి నూరు శాతం అవుతుందంటున్నారు. మొత్తం 69,948 హెక్టార్లకు గాను 56,000 హెక్టార్లలో వరి, 10,400 హెక్టార్లలో మొక్కజొన్న, 1,981లలో వేరుశనగ, 249లలో శనగ, 172లలో పెసర, 1,146 హెక్టార్లలో ఇతర పంటలు వేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ పంటలకు సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను మార్కెట్లో సిద్ధంగా ఉంచినట్లు నివేదికలో వ్యవసాయశాఖ పేర్కొంది. గతేడాది రబీలో 7,184.73 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే, ఈ ఏడాది 15,261 క్వింటాళ్ల వరి, శనగ, పెసర, వేరుశనగ, మినుములు తదితర రకాల విత్తనాలను సిద్ధం చేశారు. అదేవిధంగా గత రబీలో 50,914 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేయగా, ఈ సారి 59,205 మె.టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎం.ఓ.పి. ఎరువులను అధికారులు మార్కెట్లో సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు రబీ కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను మార్కెట్లో సిద్ధంగా ఉంచినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఫసల్ బీమాపై విస్తృత ప్రచారం.. విత్తనాల విషయంలో జాగ్రత్త జిల్లాలో ఈ రబీలో 69,948 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారన్న అంచనా మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను మార్కెట్లో సిద్ధంగా ఉంచాం. అయితే.. రైతులు ప్రధానంగా వరి విత్తనాలను ఉత్పత్తి చేసే విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగానే ఆ కంపెనీలతో విడిగా అగ్రిమెంట్ చేయించుకుంటే మేలు. దీర్ఘకాలిక రకాలను కూడా వేయొద్దు. ఫసల్ బీమా యోజన కింద రైతులు పంటల బీమా చేయించుకోవాలని కోరుతున్నాం. – వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో, కరీంనగర్ -
రబీ ప్రణాళిక సిద్ధం
ఆదిలాబాద్‌టౌన్: వ్యవసాయ శాఖ అధికారులు రబీ ప్రణాళిక కోసం యాక్షన్‌ప్లాన్ తయారీలో నిమగ్నం అయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ యేడాది జూన్‌లోనే వర్షాలు పుష్కలంగా కురిసాయి. పంటలకు ఆశాజనకంగా ఉండగా, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతియేటా అన్నదాతలు ప్రకృతి వైఫరీత్యాలు, దళారుల చేతిలోనూ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దిగుబడులు బాగా వస్తే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతిలో మోసాలకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. గిట్టుబాటు ధరలు లభించే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలు నష్టపోవాల్సిన దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగిపైనే ఆశలు.. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాలు ఉన్నాయి. తాంసి మండలంలో మత్తడి ప్రాజెక్టు, జైనథ్ మండలంలో సాత్నాల ప్రాజెక్టు మినహా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. రబీలో బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. గతంలో అరకొర నీటివనరులు, విద్యుత్ సమస్య ఉండేది. ప్రస్తుతం వర్షాలతో చెరువులు, కుంటలు, బావులు నిండి ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న రైతులు ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సీజన్లో శనగ, వేరుశనగ, మొక్కజొన్న, తదితర పంటలపైనే పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు. 23వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం అంచనా.. జిల్లాలో ఈ యేడాది రబీలో 23వేల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జొన్న, 500 హెక్టార్లలో మొక్కజొన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శనగ విత్తనాల ధర క్వింటాలుకు రూ.6,500 ఉండగా, 50 శాతం సబ్సిడీపై రూ.3250కి రైతులకు అందించనున్నారు. మిగతావి కూడా సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా రబీ కోసం ఎరువులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంటున్నారు. యూరియా 9వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 4500 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2300 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6500 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 250 మెట్రిక్ టన్నులు, మొత్తం 23,150 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 24వేల హెక్టార్లలో ఖరీఫ్ పంట నష్టం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పంటలకు నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పంటలు నష్టపోయి దిగుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని దిగాలు చెందుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 780 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 1142 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ప్రతియేటా ఏదో విధంగా రైతులు నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. అందుబాటులో ఎరువులు, విత్తనాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రబీ కోసం ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అక్టోబర్ మొదటి వారం నుంచి సబ్సిడీ విత్తనాల కూపన్లను క్లస్టర్ల వారీగా పంపిణీ చేయనున్నాం. గతంలో విత్తనాలు 33శాతం సబ్సిడీ అందించగా, ఈసారి 50శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నాం. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
సమస్యల సాగు షురూ!
62 వేల హెక్టార్లలో రబీ సాగు ప్రారంభం జాడలేని వర్షాలు.. తగ్గిన భూగర్భ జలాలు అన్నదాతను వేధిస్తున్న విద్యుత్ కోతలు హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సీజన్ సాగు మొదలైంది. ఒకవైపు ఖరీఫ్ పంటలు చేతికొస్తుండగా... రబీ సాగు చేసే చోట్ల రైతులు దుక్కి దున్నుతూ భూమిని చదును చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన రబీ సీజన్లో ఇప్పటివరకు 62 వేల హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో 21 వేల హెక్టార్లలో శనగలు, 22 వేల హెక్టార్లలో వేరుశనగ వేసినట్లు తెలిపింది. కాగా మహబూబ్‌నగర్, వరంగల్, కరీం నగర్ జిల్లాల్లో రబీ సాగు ముందుంది. ఈ సీజన్లో మొత్తం గా 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఐదు శాతం సాగు మొదలైంది. అయితే.. ఇది ఈ నెల తొలి 15 రోజుల సాధారణ సాగుతో పోలిస్తే 79 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక మరోవైపు... ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నాయి. చాలా చోట్ల వరి కోతలు పూర్తయి, నూర్పిళ్లు జరుగుతున్నాయి. మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ కూడా కోత దశలోనే ఉన్నాయి. చాలా చోట్ల పత్తి సేకరణ మొదటి దశ పూర్తికావస్తోంది. భారీగా వర్షపాతం లోటు.. రాష్ట్రంలో ఈ నెల తొలి 15 రోజుల్లో సాధారణంగా 63.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 10.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మొత్తంగా ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 35 శాతం వర్షపాతం లోటు నెలకొంది. దీంతో 351 మండలాల్లో వర్షాభావం, 34 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 69 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో... భూగర్భ జలాలు కూడా పుంజుకోలేదు. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు సగటున 7.13 మీటర్ల లోతుల్లో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 8.81 మీటర్ల లోతుగా నమోదయ్యాయి. అంటే అదనంగా 1.68 మీటర్లు లోతులోకి పడిపోయాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకో పళ్ల ప్రదర్శన క్షేత్రం జిల్లాకో పళ్ల ప్రదర్శన క్షేత్రాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు ెహ క్టార్లలో ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు శిక్షణ, సాయం, పళ్ల మొక్కలను అందించాలని యోచిస్తోంది. ఇటీవల లక్నోలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపిక ల్ హార్టికల్చర్ (సిష్)ను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, అధికారుల బృందం సందర్శించి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సిష్తో ఎంవోయూ కుదుర్చుకుని జిల్లాల్లో పళ్ల ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటుచేస్తారు. వీటిల్లో ప్రధానంగా కొత్త వెరైటీ మామిడి, జామ, నేరేడు పళ్ల మొక్కలను ఆధునిక పద్ధతిలో పెంచుతారు. రసాయనాలను చల్లకుండా బయో పెస్టిసైడ్స్‌ను వినియోగించే పద్ధతిని పాటిస్తారు. దాంతోపాటు లలిత్ అనే రకం జామను ఇక్కడి రైతులకు పరిచ యం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.