సమస్యల సాగు షురూ!
62 వేల హెక్టార్లలో రబీ సాగు ప్రారంభం
జాడలేని వర్షాలు.. తగ్గిన భూగర్భ జలాలు
అన్నదాతను వేధిస్తున్న విద్యుత్ కోతలు
హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సీజన్ సాగు మొదలైంది. ఒకవైపు ఖరీఫ్ పంటలు చేతికొస్తుండగా... రబీ సాగు చేసే చోట్ల రైతులు దుక్కి దున్నుతూ భూమిని చదును చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన రబీ సీజన్‌లో ఇప్పటివరకు 62 వేల హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో 21 వేల హెక్టార్లలో శనగలు, 22 వేల హెక్టార్లలో వేరుశనగ వేసినట్లు తెలిపింది. కాగా మహబూబ్‌నగర్, వరంగల్, కరీం నగర్ జిల్లాల్లో రబీ సాగు ముందుంది. ఈ సీజన్‌లో మొత్తం గా 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఐదు శాతం సాగు మొదలైంది. అయితే.. ఇది ఈ నెల తొలి 15 రోజుల సాధారణ సాగుతో పోలిస్తే 79 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక మరోవైపు... ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నాయి. చాలా చోట్ల వరి కోతలు పూర్తయి, నూర్పిళ్లు జరుగుతున్నాయి. మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ కూడా కోత దశలోనే ఉన్నాయి. చాలా చోట్ల పత్తి సేకరణ మొదటి దశ పూర్తికావస్తోంది.
భారీగా వర్షపాతం లోటు..
రాష్ట్రంలో ఈ నెల తొలి 15 రోజుల్లో సాధారణంగా 63.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 10.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మొత్తంగా ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 35 శాతం వర్షపాతం లోటు నెలకొంది. దీంతో 351 మండలాల్లో వర్షాభావం, 34 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 69 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో... భూగర్భ జలాలు కూడా పుంజుకోలేదు. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు సగటున 7.13 మీటర్ల లోతుల్లో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 8.81 మీటర్ల లోతుగా నమోదయ్యాయి. అంటే అదనంగా 1.68 మీటర్లు లోతులోకి పడిపోయాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాకో పళ్ల ప్రదర్శన క్షేత్రం
జిల్లాకో పళ్ల ప్రదర్శన క్షేత్రాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు ెహ క్టార్లలో ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు శిక్షణ, సాయం, పళ్ల మొక్కలను అందించాలని యోచిస్తోంది. ఇటీవల లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపిక ల్ హార్టికల్చర్ (సిష్)ను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, అధికారుల బృందం సందర్శించి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సిష్‌తో ఎంవోయూ కుదుర్చుకుని జిల్లాల్లో పళ్ల ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటుచేస్తారు. వీటిల్లో ప్రధానంగా కొత్త వెరైటీ మామిడి, జామ, నేరేడు పళ్ల మొక్కలను ఆధునిక పద్ధతిలో పెంచుతారు. రసాయనాలను చల్లకుండా బయో పెస్టిసైడ్స్‌ను వినియోగించే పద్ధతిని పాటిస్తారు. దాంతోపాటు లలిత్ అనే రకం జామను ఇక్కడి రైతులకు పరిచ యం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.