సాక్షిప్రతినిధి, కరీంనగర్: రబీ కాలం ముంచుకొస్తోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. గతేడాది రబీసాగును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ ఈ రబీ సాగు ప్రణా ళికను విడుదల చేసింది. 2018–19లో 69,948 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధంగా ఉంచింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 22 టీఎంసీల నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ ద్వారా జిల్లాలో రబీకి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన సాగునీరు ఇచ్చేందుకు కూడా ప్రణాళికను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నవంబర్‌లో రైతులకు మరోమారు ‘రైతుబంధు’ రొక్కం చేతికందనుండగా, ఈసారి రబీ రైతులకు అనుకూలిస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయశాఖ రబీ యాక్షన్ ప్లాన్ ఇదీ..
వ్యవసాయ శాఖ గత రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రబీ సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసింది. గతేడాది రబీలో 66,198 హెక్టార్లలో వివిధ పంటలు వేయగా. ఈసారి 69,948 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర తదితరు పంటలు వేస్తారని పేర్కొన్నారు. గత రబీలో 95 శాతం సాగు కాగా, ఈసారి నూటికి నూరు శాతం అవుతుందంటున్నారు. మొత్తం 69,948 హెక్టార్లకు గాను 56,000 హెక్టార్లలో వరి, 10,400 హెక్టార్లలో మొక్కజొన్న, 1,981లలో వేరుశనగ, 249లలో శనగ, 172లలో పెసర, 1,146 హెక్టార్లలో ఇతర పంటలు వేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ పంటలకు సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో సిద్ధంగా ఉంచినట్లు నివేదికలో వ్యవసాయశాఖ పేర్కొంది. గతేడాది రబీలో 7,184.73 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే, ఈ ఏడాది 15,261 క్వింటాళ్ల వరి, శనగ, పెసర, వేరుశనగ, మినుములు తదితర రకాల విత్తనాలను సిద్ధం చేశారు. అదేవిధంగా గత రబీలో 50,914 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేయగా, ఈ సారి 59,205 మె.టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎం.ఓ.పి. ఎరువులను అధికారులు మార్కెట్లో సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు రబీ కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో సిద్ధంగా ఉంచినట్లు కూడా అధికారులు వెల్లడించారు.
ఫసల్ బీమాపై విస్తృత ప్రచారం.. విత్తనాల విషయంలో జాగ్రత్త
జిల్లాలో ఈ రబీలో 69,948 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారన్న అంచనా మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను మార్కెట్లో సిద్ధంగా ఉంచాం. అయితే.. రైతులు ప్రధానంగా వరి విత్తనాలను ఉత్పత్తి చేసే విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగానే ఆ కంపెనీలతో విడిగా అగ్రిమెంట్ చేయించుకుంటే మేలు. దీర్ఘకాలిక రకాలను కూడా వేయొద్దు. ఫసల్ బీమా యోజన కింద రైతులు పంటల బీమా చేయించుకోవాలని కోరుతున్నాం. – వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో, కరీంనగర్
రబీ యాక్షన్ ప్లాన్ రెడీ
Published Sun, Sep 30 2018 10:02 AM | Last Updated on Sun, Sep 30 2018 10:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment