మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రాధిక
షాద్‌నగర్ క్రైం/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: పిండి నేలపై పారబోసిందని క్షణికావేశంలో కన్నకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలిక మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడకి చెందిన చెన్నయ్య, స్వరూప దంపతులు గత శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడుతున్నారు. అప్పుడే వీరి చిన్న కుమార్తె రాధిక (9) రొట్టెల పిండిని తీసుకొస్తూ కింద పడేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి స్వరూప కూతురి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గ్రామస్తులు రాధికను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన రాధిక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మంగళవారం రాధిక మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.
ఆ తల్లిపై హత్యకేసు పెట్టాలి: బాలల హక్కుల సంఘం
క్షణికావేశంలో కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించి మరణానికి కారణమైన తల్లి స్వరూపపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరికొన్ని ఇళ్లల్లో.. రాధిక లాగే మిగిలిన పిల్లలకు రక్షణ లేదని, తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణాపాయం పొంచి ఉందన్న అభిప్రాయాన్ని ఆ సంఘం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించి వారి బాగోగులు చూసుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.