రేడియల్ రోడ్లపై ‘మహా’ నిర్లక్ష్యం!
♦ నగరంలో నత్తనడకన రేడియల్ రోడ్ల నిర్మాణం
♦ పనుల పర్యవేక్షణను పట్టించుకోని హెచ్ఎండీఏ
♦ ‘ఔటర్’తో అనుసంధానం లేక ట్రాఫిక్ తిప్పలు.. జనసంచారం లేక దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఇంట్లోంచి కాలు తీసి బయటపెట్టాలంటేనే భయపడేంతగా హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ భూతం కమ్మేస్తోంది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి ఉపయోగపడుతుందని వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు అలంకారప్రాయంగా మారింది. ఫలితంగా నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారంగా నగర ట్రాఫిక్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ ప్రారంభించిన రేడియల్ రోడ్ల నిర్మాణ ంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. మరోవైపు ఆయా మార్గాల్లో నిర్మాణ పనుల వల్ల రాకపోకలు స్తంభించడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జనసంచారం లేక ఆయా మార్గాల్లోని వ్యాపార సంస్థలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ పనులను పర్యవేక్షించాల్సిన హెచ్ఎండీఏ అధికారులు తమ లక్ష్యాన్ని గాలికి వదిలేశారు. విశ్వనగరం ప్రాజెక్టులో రేడియల్ రోడ్ల అభివృద్ధి భాగమే అయినా.. వాటి గురించి ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది.
33 రోడ్ల సామర్థ్యం పెంచే యత్నం..
నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ మొత్తం 33 రోడ్లను 4-6 లేన్లుగా విస్తరించి రేడియల్ రోడ్లుగా సామర్థ్యం పెంచాలని గతంలో హెచ్ఎండీఏ నిర్ణయించింది. వీటిలో 5 రోడ్లు ఆర్అండ్బీ, నేషనల్ హైవేపై ఉండగా, మరో 4 రోడ్లను జైకా ఫండ్స్‌తో హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ.. ఇంకో 3 రోడ్లను హెచ్‌జీసీఎల్, హెచ్ఎండీఏ కలసి నిర్మించాయి. ప్రస్తుతం షేక్‌పేట్-కోకాపేట్(ఆర్ఆర్-5), జీడిమెట్ల-సారెగూడెం(ఆర్ఆర్-11), తిరుమలగిరి-రాధికా జంక్షన్-యాద్గార్పల్లి జంక్షన్(ఆర్ఆర్-15), ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్-చేర్యాల ఎక్స్‌రోడ్(ఆర్ఆర్-16), నాగోలు జంక్షన్-గౌరిల్లి ఎక్స్‌రోడ్(ఆర్ఆర్-22) వరకు మొత్తం 54.43 కి.మీ. మేర 5 రోడ్లను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఇక మిగిలిన 16 రోడ్లను ఆర్అండ్బీ స్టేట్ బడ్జెట్‌తో నిర్మించాలని నిర్ణయించారు.
పట్టించుకునే వారు లేరు?
షేక్‌పేట్ నుంచి కోకాపేట్ వరకు 5.80 కి.మీ. దూరం తలపెట్టిన రేడియల్ రోడ్డు నిర్మాణం నత్తతో పోటీ పడుతోంది. రూ.26.6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు పనులు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. 10 మీటర్ల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే షేక్‌పేట్ ఆక్విడెక్ట్ వద్ద రోడ్డు వెడల్పు 7 మీటర్లే ఉండటంతో అక్కడ రోడ్డు విస్తర ణకు ఇబ్బంది ఎదురైందని అధికారులు సాకుగా చూపుతున్నారు. ఇక్కడ 10 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవుతో నిర్మించాల్సిన బ్రిడ్జి డిజైన్‌పై తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఇటీవలే డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. అయినా ఇప్పటికీ పునాది దశను దాటలేదు.
ఇక జీడిమెట్ల నుంచి సారెగూడెం వరకు 8.55 కి.మీ. దూరం రూ.69.9 కోట్ల వ్యయంతో రేడియల్ రోడ్డు నిర్మించే పనులు 2013 జనవరిలో ప్రారంభమయ్యాయి. 2014 జూలై నాటికి ఈ రోడ్డు పూర్తి కావాలి. గడువు ముగిసి ఏడాది దాటినా ఇంతవరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా రూ.12 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. మిగతా రోడ్ల నిర్మాణంలో కూడా ప్రగతి అంతంత మాత్రమే. నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయనప్పుడు కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులిచ్చి టెర్మినేట్ చేయడం పరిపాటి. అయితే హెచ్ఎండీఏ అధికారులు సదరు కాంట్రాక్టర్‌పై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తుడటం అనుమానాలకు తావిస్తోంది.
వ్యాపారుల గగ్గోలు..
ఆయా ప్రాంతాల్లోని వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 8-9 నెలలుగా వ్యాపారం లేక షాపులకు అద్దె చెల్లించలేని దుస్థితి ఎదురైంది. రేడియల్ రోడ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో.. తమ బతుకులు ఎప్పుడు బాగుపడతాయోనని వారు గగ్గోలు పెడుతున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం
రోడ్డు పనుల కారణంగా ట్రాఫిక్ లేక 8 నెలలుగా వ్యాపారాలు నడవట్లేదు. జీవనోపాధికి ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు గుదిబండగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేము నష్టపోవాల్సి వస్తోంది.
- వి. రామకృష్ణ, వ్యాపారి, పుప్పాలగూడ
చేతి నుంచి అద్దెలు చెల్లిస్తున్నాం
నగరంలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా మెట్రో పనులు సాగిస్తున్నారు. షేక్‌పేట్ మార్గంలో మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇష్టారీతిన పనులు చేస్తూ వ్యాపారులు, ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ఆదాయం లేకపోగా చేతి నుంచి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది.
- పి.రవికుమార్, వ్యాపారి, మణికొండ