raghunadhapalem
-
తల్లి, భార్య వారించినా వినకుండా పార్టీకి వెళ్లి.. ఒక్క నిమిషమైతే!
నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే పోలీసులు అవగాహన కల్పించినా.. ఇంట్లో తల్లి ఎంతగా వారించినా.. ఫోన్లో భార్య ఎంత వేడుకున్నా.. వినకుండా బయట పార్టీకి వెళ్లారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తర్వాత మృత్యువును కూడా ఆహ్వానించారు. బైక్‌ను వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకుపోగా.. దానిపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడి తలలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సాక్క్షి, ఖమ్మం: చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులుగా ఉన్న వారిద్దరూ మృత్యువులోనూ బంధం వీడలేదు. నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఎంతో ఆనందాన్ని నింపాల్సిన ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. తాము చెప్పినట్లు విని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆ యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన రఘునాథపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరంలోని పాండురంగాపురం గ్రామంలో పెయింటింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కట్ల పుల్లారావు (24), రఘునాథపాలెంలో నివాసం ఉండే, ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న (గతంలో ఇతను కూడా పెయింటింగ్ పనిచేసేవాడు) సాయి (25) ఇద్దరు స్నేహితులు. 2022 ఏడాది చివరి రోజు కాబట్టి తోటి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బయటకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం పుల్లారావు తన ద్విచక్రవాహనంపై సాయిని ఇంటి వద్ద దించేందుకు రఘునాథపాలెం చేరుకున్నాడు. సెంటర్లో వేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పి ఓ దుకాణం మెట్లను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడ్డారు. వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలియగానే రఘునాథపాలెం ఎస్ఐ ఎం.రవి సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్ సందర్శించారు. పెళ్లి అయి ఏడాదే.. పుల్లారావుకు వెన్నెల అనే యువతితో ఏడాది కిందటే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. గత నెల 29న వెన్నెల తన పుట్టింటికి వెళ్లింది. తన భర్త పార్టీకి వెళ్తున్నట్లు గ్రహించిన ఆమె తన అత్తకు ఫోన్ చేసి పార్టీకి వెళ్లకుండా ఆపాలని వేడుకుంది. పుల్లారావుకూ ఫోన్ ద్వారా చెప్పింది. అయినా పుల్లారావు తన తల్లి, భార్య మాట వినకుండా బయటకు వెళ్లి వారు సందేహించినట్లుగానే మృత్యువాడ పడి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఒక్క నిమిషమైతే.. ఇదే ప్రమాదంలో మరణించిన సాయి.. ఒక్క నిమిషమైతే ఇంటికి చేరుకునేవాడే. ఇంటికి అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగి అతడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం సవ్యంగా వచ్చి ఉంటే ఇంట్లోకి చేరుకునే వాడని అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. కాగా, సాయి రెండేళ్ల కిందట ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండు నెలల కిందట అతడికి పాప పుట్టింది. యువత ఆలోచనలో మార్పు మారాలి.. డిసెంబర్ 31న మిత్రులతో కలిసి పార్టీలు చేసుకోవడం.. మద్యం మత్తులో అతివేంగా వాహనాలపై రాకపోకలు సాగించడం.. లాంటివి చేయొద్దని పదే పదే ప్రచారం చేశాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా, పత్రికల ద్వారా అవగాహన కల్పించాం. ప్రధాన రోడ్ల వెంట భారీగా పెట్రోలింగ్ చేపట్టాం. అయినా ప్రమాదం జరగడం బాధాకరం. ఇలాంటి ఘటనలు చూసైనా యువత ఆలోచనలో మార్పు రావాలి. నియంత్రిత వేగంతో బైక్‌లు నడపటంతోపాటు హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. – శ్రీనివాస్, రూరల్ సీఐ -
అయ్యో..చిన్నా.. వేడి నీటిలో పడి బాలుడి మృతి
సాక్షి,రఘునాథపాలెం: చిన్న ఏమరుపాటు పసివాడి ప్రాణం తీసింది. ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. బద్ధ్యాతండాకు చెందిన రమేష్ – అరుణ దంపతుల చిన్న కుమారుడు నునావత్ గీతమ్‌రామ్(4) ఈ నెల 8వ తేదీన హీటర్‌తో నీటిని వేడి చేసిన బకెట్లో ప్రమాదవశాత్తు పడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు కుమారులకు స్నానం చేయించేందుకు టీవీ దగ్గర ఉన్న స్విచ్‌బోర్డు వద్ద తల్లి హీటర్ ప్లగ్ పెట్టి బకెట్లో నీటిని వేడి చేసింది. అదే సమయంలో పెద్ద కుమారుడు అన్నం పెట్టాలని మారాం చేయడంతో అమ్మ అరుణ ప్లగ్ తీసేసి..ప్లేట్లో భోజనం తీసుకొచ్చేందుకు వంటగదిలోకి వెళ్లింది. అదే సమయంలో చిన్న కుమారుడు టీవీ స్వీచ్ వేసేందుకు వెళ్లి అక్కడ జారి..పక్కనే ఉన్న వేడి నీటి బకెట్లో పడి..బిగ్గరగా కేకలు వేశాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్న తల్లి బిడ్డను బయటకు తీసింది. అప్పటికే తీవ్ర గాయాలైన బాబును తొలుత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స చేయిస్తుండగా..ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందాడు. గురువారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ ఘటన విషాదం నింపిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం..
సాక్షి, రఘునాధపాలెం: నాగపూర్– అమరావతి నేషనల్ హైవే భూ సేకరణ కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి సమక్షంలో భూములు కోల్పోయే రైతులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం రైతులు అందోళనతో వాయిదా పడింది. భూములకు సంబంధించి రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీటీడీసీ భవనంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జేసీ అనురాగ్ జయంతి హాజరయ్యారు. భూములు కోల్పోయే రైతులతో పాటు ఆయా పార్టీల రైతు సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. తొలుత ఖమ్మం రూరల్ మండలం తీర్థాల పరిధిలో రైతులను చర్చలకు పిలిచారు. సమావేశంలో తీర్థాల రైతులతో పాటు రఘునాథపాలెం మండలంలోని భూములు కోల్పోయే గ్రామాలకు చెందిన రైతులంతా హాజరయ్యారు. ప్లకార్డులతో తమ భూములు రోడ్డు కోసం ఇచ్చేది లేదని ఆందోళన చేశారు. జేసీ రైతులతో మాట్లాడుతూ మీ అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచామని, ధర విషయం, రోడ్డు వద్దా అని తెలుసుకోవడానికి పిలిచినట్లు పేర్కొన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు ఇవ్వమంటూ రైతులు జేసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘం నాయకులు బాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు, యస్.నవీన్‌రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మల్లేష్, తొండల సత్యనారాయణ కార్పొరేటర్, సర్పంచ్‌లు బాధిత రైతులు తక్కిళ్లపాటి భద్ర య్య, వేములపల్లి రవి, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, బోజడ్ల వెంకటయ్య, శ్రీనివాస్, నరసింహారావు, మం దనపు రవీందర్, రఘు, పాటి వెంకటేశ్వర్లు, మేదరమెట్ల శ్రీను, ప్రభాకర్ సూర్యం తదితరులు పాల్గొని హైవేతో సాగు భూములు కోల్పోయి రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేయడంతో జేసీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. -
పూజ చేస్తామంటూ వచ్చి..
సాక్షి, ఖమ్మం(రఘునాథపాలెం) : మండలంలోని చింతగుర్తి గ్రామంలో మంగళవారం పూజల పేరుతో ఓ ఇంట్లో ఉన్న హోం థియేటర్ సెట్‌ను తీసుకొని పారిపోతున్న ముగ్గురు యువకులను గ్రామ పొలిమేర వద్ద అటకాయించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఖమ్మంరూరల్ మండలం సత్యనారాయణపురానికి చెందిన ముగ్గురు యువకులు సాధు వేషాలు వేసుకోని చింతగుర్తి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పూజలు చేస్తామంటూ వెళ్లారు. ఈక్రమంలో గ్రామంలో అప్పారావు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో అప్పారావు కొడుకు, భార్య ఉన్నారు. కొడుకు పాపయ్యతో మాటలు కలిపిన యువకులు ‘నీకు ఉద్యోగం వస్తుంది కానీ..ఓ అడ్డంకి ఉంది. పూజలు చేస్తే తొలుగుతుంది’ అని నమ్మించారు. అదే సమయంలో తల్లి పక్కింటికి వెళ్లింది. ఒంటరిగి ఉన్న అతడిని నమ్మబలికించి చేతిలో తీర్థం పోసి, చేతికి తాయత్తు కట్టి దీనికి రూ.6 వేలు ఇవ్వాలని కోరారు. పాపయ్య తన వద్ద అంత డబ్బులేదని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు ఇవ్వాలని సాధు వేషంలో ఉన్న యువకులు కోరి, హోం థియేటర్‌ను తీసుకోని అక్కడి నుంచి ఉడాయించారు. అదే సమయంలో పాపయ్యతల్లి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని చుట్టుపక్కల వారికి తెలపగా గ్రామానికి చెందిన పెంట్యాల శ్రీను అనే వ్యక్తి పాపయ్యను తీసుకొని ద్విచక్రవాహనంపై వేపకుంట్ల వైపు వెళ్లి అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు పారిపోగా ఓకడిని పట్టుకున్నారు. అతడిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గ్రామంలోకి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఏఏస్ఐ దానియేలు గ్రామానికి చేరుకొని ఆ యువకుడుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత ముగ్గురు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి మైనర్లు కావడంతో తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది. -
వేపచెట్టుకు కల్లు..!
రఘునాథపాలెం : మండలంలోని వీవీ.పాలెంలో టి.దానయ్య అనే వ్యక్తి ఇంటి పెరడులోని వేపచెట్టుకు కల్లు పారుతోంది. సహజంగా తాటి, ఈత చెట్లకు కల్లును గీత కార్మికులు గీస్తారు. అయితే..ఇక్కడ వేపచెట్టు కాండం నుంచి కొన్ని రోజులుగా ద్రవం కారుతుండడంతో..ఇది కల్లు అని గుర్తించి ఇంటి యజమాని లొట్టిలోకి ఆ కల్లు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఇది తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి వెళుతున్నారని దానయ్య తెలిపాడు. -
వాగ్దానాలు అమలు చేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి రఘునాధపాలెం: ఎన్నికల ముందు పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కిందని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ఆర్ అర్హులైన పేదలందరికీ నెలకు రూ. 200 పింఛన్ ఇస్తే.. నేటి పాలకులు అనేక కుంటిసాకులు చెపుతూ అర్హులైన పలువురి పెన్షన్లు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా పేదలు ఈ విషయం పైనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతు రుణమాఫీలోనూ పేదలను మోసం చేశారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు మృత్యువాత పడుతున్నారని, సోమవారం ఖమ్మం మార్కెట్లో జరిగిన ఘటన చూస్తే ప్రభుత్వం అన్నదాతల పట్ల ఎలాంటి వైఖరి అవలంభింస్తో తెలుస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి కూడా హామీలకే పరిమితమైందని విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు.