రక్తచరిత్రే..
వరంగల్ క్రైం/రఘునాథపల్లి/జనగామ రూరల్ : వీరిని చూస్తే... అమాయకులని అనిపిస్తుంది. కానీ.. వీరి వెనుక పెద్ద రక్త‘చరిత్రే’ ఉంది. జిల్లాతోపాటు రాష్ర్ట్రంలోని పలు ప్రాంతాల్లో నరమేధం సాగించి.. దోపిడీ చేసిన పార్థీ ముఠా సభ్యులు వీరే. వీరికి 31 హత్య కేసుల్లో ప్రమేయముండగా... బీబీనగర్, రఘునాథపల్లి, లింగంపల్లి,సదాశివపేట, పెద్దపల్లి ఘటనల్లో ప్రధాన నిందితులు. గత నెల 24న హైదరాబాద్‌లోని లింగంపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జైలులో ఉన్న నలుగురు నిందితులను రఘునాథపల్లి హత్యాకాండ కేసుపై జనగామ కోర్టుకు హాజరుపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఇలాంటి కరుడు గట్టిన నరరూప రాక్షసులు పార్థీ గ్యాంగ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఖాకీలకు చిక్కింది పార్థీ గ్యాంగ్‌లోని ఒక ముఠాకు చెందిన వారే. పార్థీ ముఠాకు సంబంధించిన మరో 8 బృందాలు జిల్లాలో తిరుగుతున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మహారాష్ట్రలోని ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే ప్రాంతాలకు చెందిన ఈ దొంగల ముఠా ఇప్పటివరకు జిల్లాలో ఐదు దొంగతనాలకు పాల్పడింది. దీంతోపాటు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంటలో ఒక్కొక్క దొంగతనానికి పాల్పడ్డారు.
వీరు చేసిన ప్రతి దొంగతనంలోనూ హత్యలకు పాల్పడ్డారు. ‘మర్డర్ ఫర్ గెయిల్’ నేరాల కింద పిలువబడే పార్థీ గ్యాంగ్ సభ్యుల వ్యవహార శైలి అత్యంత క్రూరత్వం. వారు సృష్టించిన నరమేధాలే ఇందుకు నిదర్శనం. దొంగతనానికి ఒడిగట్టే ఇంటిలో ఆ రాత్రి భయానక వాతావరణం కల్పించడం... ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అనే తేడా లేకుండా ఇంట్లో ఎవరు ఉన్నా, రాడ్లు, కర్రలతో తలపై కొట్టడం, కత్తులతో కోయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు ఈ ముఠాలోని సభ్యులు గతంలో మూడు సార్లు పోలీసులకు చిక్కారు.
ప్రతి ఒక్క దోపిడీలోనూ హత్యలే...
ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉండే పార్థీ గ్యాంగ్ సుబేదారి, శాయంపేటలో చేసిన రెండు దొంగతనాల్లో బీభత్సం సృష్టించారు. హన్మకొండ జులైవాడలో జరిగిన సంఘటనలో భార్య, భర్తలను తీవ్రంగా కొట్టడంతో పాటు భార్య గొంతుకోసి సొత్తు దొంగిలించారు. అదేవిధంగా... శాయంపేట, నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన దోపిడీ సంఘటనల్లో కూడా హత్యకు పాల్పడారు. నెక్కొండ సమీపంలోని తండాల్లో మరో రెండు దొంగతనాలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ను హత్యచేసి దోచుకెళ్లారు.
నల్లగొండ పోలీసులకు దొరికిన వీరు రాష్ర్టవ్యాప్తంగా పది దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇందులో హైదరాబాద్‌లో నాలుగు కాగా... వరంగల్ రఘునాథపల్లికి చెందినది మరొకటి. గీత వృత్తి చేస్తూ రఘునాథపల్లి మండల కేంద్రంలో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న చెరుకు నర్సింహులు, రేణుక ద ంపతుల కుటుంబం ఈ ముఠా కిరాతకంతో చిన్నాభిన్నమైంది. ఇంట్లో బంగారం, నగదు దోచుకుపోవడంతోపాటు మేల్కొన్న రేణుక కూతురు అకిరనందిని, తల్లి లచ్చమ్మ, అమ్మమ్మ రాధమ్మను రాడ్లతో బాది అతి కిరాతకంగా బలిగొన్నారు. ముక్కుపచ్చలారని రేణుక కుమారుడు హర్షవర్దన్‌పైనా ప్రతాపం చూపించారు. తీవ్ర గాయాల పాలు చేయడంతో ఇప్పటికీ ఆ బాబు ఆరోగ్యం నిలకడగా లేదు.
రాత్రి వేళల్లో మాత్రమే దొంగతనాలు .....
పగలు గానీ.. రాత్రి గానీ తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే దొంగతనాలకు ఎంచుకుంటారు దొంగలు. కానీ.. పార్ధీ గ్యాంగ్ కేవలం రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. చూడడానికి పొట్టిగా, నల్లగా ఉండే వీరు చిత్తు కాగితాలు ఏరుకోవడం, పిన్నిసులు అమ్మడం, బిచ్చం ఎత్తుకోవడం వంటివి చేస్తుంటారు. మధ్యాహ్నం వేళల్లోఈ పనిచేస్తూ.. రెక్కీ నిర్వహించి దొంగతనం చేసే ఇంటిని ఎంచుకుంటారు. రాత్రి వేళలో ముఠాగా ఆ ఇంటి పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో వారికి తెలిసే విధంగానే తలుపులు, కిటికీలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. లోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వారిని చావబాది డబ్బులు, బంగారం అపహరిస్తారు.
బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లే వీరి అడ్డా. ఎక్కువ మంది ఉన్న సమయంలో ఈ స్టేషన్లకు దగ్గరగా డేరాలు వేసుకుని ఉంటారు. ఎక్కువసార్లు బస్‌స్టేషన్‌లోని డార్మెట్లలో బసచేస్తుంటారు. దొంగతనం చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల లోపు వీరు ఎలాంటి దోపిడీకి పాల్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, రఘునాథపల్లిలో బీభత్సం సృష్టించి పట్టుబడిన పార్థీ ముఠా సభ్యులు షేరియాష్కాడే, సంతోష్ షిండే, తరుణ్బోస్లే, పరమేశ్వర్ బోస్లేను జనగామ కోర్టులో హాజరు పరుస్తున్నారనే సమాచారంతో మండల కేంద్రం లోని పలువురు యువకులు అక్కడికి తరలివెళ్లారు. కిరాతకంగా ముగ్గురిని బలిగొన్న నిందితుల్ని ఉరితీయాలని నినాదాలు చేశారు.
నగరంలో స్టూవర్ట్‌పురం దొంగలు
నగరంలో పార్థీ గ్యాంగ్‌తో పాటు స్టూవర్ట్‌పురానికి చెందిన దొంగల ముఠా ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ప్రజల దృష్టి మర ల్చి దొంగిలించడం వీరి స్టైల్. బ్యాంకుల వద్ద, డబ్బులు మారే చోట వీరు ఎక్కువగా గమనిస్తుంటారు. ఇటీవల కాలంలో సుబేదారిలోని ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల వద్ద చోరీ చేశారు. వరంగల్ ఎస్బీహెచ్ వద్ద పలు దొంగతనాలకు పాల్పడ్డారు. స్టువర్ట్ ప్రాంతంలోని నగరి, బాపట్ల, ఎదుళ్లపల్లి నుంచి వీరు ఇక్కడకు వచ్చి తిష్టవేశారు. సుమారు 5 గ్యాంగ్‌లు నగరంలో తిరుగుతున్నట్లు, ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం.