raghunathapalli
-
తలలో కణితి.. శిశువుకు శస్త్రచికిత్స
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి తెలిపారు. -
చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, రఘునాథపల్లి: వీధి లైటు వేయాలని ప్రశ్నించిన యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టాడు. దీంతో అవమాన భారం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పంచ్ ధరావత్ రమేష్ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్ (28) సర్పంచ్‌ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన సర్పంచ్.. ఎల్లేష్‌ను చెప్పుతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన ఎల్లేష్.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా, తండావాసులు సోమవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సర్పంచ్‌పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, రూ.30 వేల నగదు ఇచ్చేలా తండా పెద్దలు నచ్చచెప్పారు. (కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి) -
జనగామ పరిసరాల్లో గూడు సమాధులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అరుదైన సమాధి నిర్మాణంగా గుర్తింపు పొందిన గూడు సమాధులు (డాల్మన్స్) జనగామ జిల్లాలోనూ వెలుగు చూశాయి. చుట్టూ వృత్తాకారంలో పాతిన రాళ్లు.. వాటి మధ్య నిలువు రాళ్లు, వాటి మీద వెడల్పాటి రాతి మూత ఏర్పాటు... ఇది క్రీ.పూ. 600 క్రితం నాటి సమాధుల ఆకృతి. గోదావరి నదీతీరంలోని పినపాక, మల్లూరు, జానంపేట, తాడ్వాయి తదితర దట్టమైన అటవీప్రాంతంలో వేల సంఖ్యలో ఈ తరహా నిర్మాణాలు పురావస్తు శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్నాయి. గత ఏడాది అమెరికాలోని శాండియాగో వర్సిటీ ఆచార్యులు వీటిని పరిశీలించి ఆశ్చర్యపోయారు. వీటిపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర పురాతత్వ పర్యవేక్షణ సంస్థ (ఏఎస్ఐ) పినపాక మండలం జానంపేటలో వీటిపై అధ్య యనం మొదలుపెట్టింది. ఆ తరహా సమాధులు గోదావరి నదీ తీరానికే పరిమితమయ్యాయన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. కానీ జనగామ జిల్లా రఘునాథపల్లి పరిధిలోని గుట్టలపై కూడా వీటిని పోలిన సమాధులున్నట్టు తేలింది. ఆ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి తాజాగా రఘునాథపల్లిలోని రాములవారిగుట్టపై వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలోని అన్ని గుట్టలపై ఇలాంటి సమాధులున్నాయని, వాటికి రక్షణ లేకపోవటంతో క్వారీ పేలుళ్లతో ధ్వంసమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భావితరాలకు వీటి దర్శనభాగ్యం ఉండాలంటే క్వారీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మల్లూరు గుట్టపైఉన్న గూడు సమాధుల్లో శవాల అవశేషాలు ఉంచేందుకు రాతి తొట్లను ఏర్పాటు చేసేవారని, కానీ ఈ ప్రాంతంలోని సమాధుల్లో అలాంటి తొట్లు కనిపించటం లేదన్నారు. గుట్ట దిగువన రాకాసిగుళ్లు (సమాధుల చుట్టూ గుండ్రటి రాళ్ల ఏర్పాటు) వేల సంఖ్యలో ఉన్నాయని, వ్యవసాయం వల్ల అవన్నీ కనుమరుగవుతున్నాయన్నారు. రాములవారి గుట్ట పై అతిపెద్ద డాల్మన్ శిథిలాలు కనిపించాయి. 24 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున్న భారీ రాతి సల్ప మూడు ముక్కలై కనిపిస్తోంది. ఇది గూడు సమాధి పైభాగంలోని రాయి. క్వారీ పనుల్లో భాగంగా దీన్ని ధ్వంసం చేశారు. పైమూతగా వాడిన రాతి సల్ప అంతపెద్దగా ఉందంటే, ఆ సమాధి కూడా పెద్దగా ఉండి ఉండాలి. వాటిపై అధ్యయనం జరిపేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ పురావస్తు శాఖ మాత్రం వీటిని గుర్తించకపోవటం, వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి ధ్వంసమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఆదిమానవులు రాతి ఆయుధాలను నూరేందుకు రాతి బండలపై ఏర్పాటు చేసుకున్న పొడవాటి గుంతలు (గ్రూవ్స్) కూడా ఉన్నాయి. ఇక కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్న ఓ శాసనం, సమీపంలోని కానుగులవాగు ఒడ్డుపై దేవాలయ ఆనవాళ్లు, మెత్తటి శిలపై రెండు పాదాలు మాత్రమే కనిపిస్తున్న శిల్పం ఉంది. ఆ శిల్పం మిగతా భాగం భూమిలో కూరుకుపోయి ఉంది. అది వీరగల్లు శిల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రాణాలు తీశారు.. దోచుకెళ్లారు
రఘునాథపల్లి : ఆ అర్ధరాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఇంట్లో గాఢనిద్రలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు. పసిపిల్లలు, వృద్ధులు అని చూడకుండా కిరాతకంగా ప్రవర్తించారు. రాడ్లతో చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రఘునాథపల్లిలో శుక్రవా రం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన చెరుకు నర్సింహ, రేణుక దంపతులు గీత వృత్తి చేస్తూనే కుటుంబ సభ్యులతో హోటల్ నిర్వహిస్తున్నారు. వారి కూతురు అఖిరానందిని(11), కుమారుడు హర్షవర్ధన్ జనగామ ఎస్వీఆర్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాలకు బస్సులోనే వెళ్లొస్తున్నారు. కాగా రేణుక తండ్రి ఇటీవల మృతిచెందడంతో అప్పటి నుంచి ఆమె తల్లి లచ్చమ్మ(51) కూతురి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 8న న ర్సింహ తండ్రి కొమురయ్య ఆనారోగ్యంతో మృతిచెందగా గురువారం ఐదోరోజు కార్యక్రమం చేశారు. అనంతరం రాత్రి న ర్సింహ తన అత్త లచ్చమ్మను, ఆమె తల్లి లింగంపల్లి రాధమ్మ(71)తోపాటు పిల్లలు హర్షవర్దన్, అఖిరా నందినిని హోటల్లో పడుకోమని చెప్పి పంపాడు. నలుగురు ముందు గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగు లు ఇంటి వెనకాల ఉన్న తలుపును పైకి లేపి ప్రవేశించారు. దొంగల అలికిడి విని వారు నిద్రలేచి అరవడంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చిన్నారి నందినికి గదవ భాగంలో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా మిగతావారంతా తీవ్రగాయూలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న నగలతోపాటు బీరువాలోని రూ.80 వేల నగదు, గల్లగురిగిలోని రూ.10 వేలకుపైగా నాణాలు, రెండు, మూడు తులాల బంగారు పుస్తెలతాళ్లు, మూడు తులాల నగలు, చిన్నారులకు చెందిన నాలుగు ఉంగరాలను దోచుకెళ్లారు. పక్కింటికి గడియ పెట్టి దారుణం.. నర్సింహ హోటల్ పక్కనే అతడి అక్క కోళ్ల అండాలు తన కుటుంబ సభ్యులతో మరో హోటల్ నిర్వహిస్తోంది. గురువారం రాత్రి ఆమె కుమారుడు సందీప్ స్నేహితులతో కలిసి హోటల్ వెనుక గదిలో నిద్రించాడు. పక్క హోటల్లో దోపిడీకి వచ్చిన దొంగలు వారి తలుపు గడియపెట్టారు. ఉద యం లేచాక సందీప్ తలుపు తీయబోగా తెరుచుకోలేదు. బయట గడియ పెట్టినట్లు గుర్తించిన అతడు తన తల్లి అండాలుకు ఫోన్ చేశాడు. దీంతో అతడి తమ్ముడు వచ్చి తలుపు గడియ తీశారు. 8 గంటల ప్రాంతంలో హరీష్ స్నానం చేసేందుకు బకెట్ తెచ్చుకునేందుకు నర్సింహ ఇంటి వెనకాలకు వెళ్లగా తలుపు తొలగించి ఉండటంతో దొంగలు పడిన ట్లు భావించాడు. లోపలికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో కొనఊపిరితో ఉన్న హర్షవర్దన్ డాడీ.. డాడీ అని పిలుస్తూ కనిపించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన హరీష్ వెంట నే తండ్రి శ్రీనుకు సమాచార మిచ్చాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే అఖిరానందిని, లచ్చమ్మ మృతి చెందగా, అపస్మారకస్థితిలో ఉన్న హర్షవర్ధన్, రాధమ్మను ఆస్పత్రికి తరలించారు. రాధమ్మ చికిత్సపొందుతూ మృతిచెందింది. రోదనలతో మిన్నంటిన రఘునాథపల్లి దారణం గురించినవార్త దావలంలా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, 3స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారి రోదనలతో రఘునాథపల్లి మార్మోగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు కన్నీరుపెట్టారు. వరంగల్ రేంజ్ డీఐజే కాంతారావు, వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాస్, అడిషనల్ ఎస్పీ కె శ్రీకాంత్ , జనగామ డీఎస్పీ కూర సురేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ సీఐ రఘు బృందం అణువణువు క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : డిప్యూటీ సీఎం రాజయ్య మృతుల కుటుంబాలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయ న పరామర్శించి ఓదార్చారు. దుండగులను వెంటనే పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు బానోతు శారద, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రవి, నాయకులు బుచ్చయ్య, రాంబాబు, గోపాల్‌నాయక్ ఉన్నారు. -
చిన్నారి సహా మహిళను హతమార్చారు
-
చిన్నారి సహా మహిళను హతమార్చారు
వరంగల్ : వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజామున రఘునాథ్పల్లిలో మూడిళ్లలో దాడిచేసి అడ్డువచ్చినవారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షిత నందిని అనే చిన్నారితో పాటు లక్ష్మి అనే మహిళను దుండగులు హతమార్చారు. పలువురిని గాయపరిచారు. సుమారు ఏడుగురు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒకేసారి మూడిళ్లలోకి ప్రవేశించి వారిని బంధించి, అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. నగదుతో పాటు బంగారం కోసం వారిపై దాడి చేశారు. గాయపడిన ఓ బాలుడితో పాటు వృద్ధుడిని జనగామ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.