ఆర్బీఐ రాజన్ పాలసీలనే కొనసాగించాలి: మూడీస్
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం కట్టడికి గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న పాలసీలనే, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొనసాగించాలని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సూచించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురావడానికి రాజన్ తీసుకున్న కఠినతరమైన విధానాలు సత్ఫలితాలను చూపించాయని వెల్లడించింది. అదే మాదిరి విధానాలను రాజన్ పదవీ విరమణ అనంతరం కూడా ఆర్బీఐ కొనసాగిస్తే మంచిదని తెలిపింది. విశ్వసనీయత, ద్రవ్య విధాన పాలసీ అంశాలు భారత సార్వభౌమ రేటింగ్స్‌పై ప్రభావితం చూపుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సావరీన్ రిస్క్ గ్రూపు మేరి డిరోన్ తెలిపారు.
పాజిటివ్ అవుట్‌లుక్‌తో భారత్‌కు బీఏఏ3 రేటింగ్ ఇచ్చింది. గత రెండేళ్లుగా భారత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, విశ్వసనీయతమైన ద్రవ్య విధానం వల్లనే ఇది సాధ్యమైందని డిరోన్ కొనియాడారు. ఇవే పాలసీలను రాజన్ తదనాంతరం ఆర్బీఐ కొనసాగిస్తుందని నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధిస్తుందని డిరోన్ భావిస్తున్నారు. కాగా ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయబోతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉంచి, ఆర్థికవృద్ధికి ఆటంకంగా మారారని ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు. 2021 వరకు ద్రవ్యోల్బణం టార్గెట్ 4 శాతంగా ప్లస్ లేదా మైనస్ 2 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించి నమోదుచేయమని, 4 శాతాన్ని ద్రవ్బోల్బణ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తన ప్రసంగంలో వెల్లడించారు.