Raghuveer
-
రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అభ్యుదయ యువరైతు నందం రఘువీర్‌కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) వినూత్న రైతు అవార్డు–2024ను అందజేసింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే) మేళాలో ఐఏఆర్ఐ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఏకే సింగ్ ఈ అవార్డును రఘువీర్‌కు ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్న ఏకైక ఆదర్శ రైతుగా రఘువీర్ నిలిచారు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలన్న సంకల్పంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి. పెనమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేస్తున్నారు. ఎనిమిది జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన పెదబయలు మండలంలో పురాతన దేశీ విత్తన నిధిని ఏర్పాటుచేశారు. గిరిజన రైతులకు పురాతన వంగడాలను ఉచితంగా అందిస్తూ వాటి పునరుత్పత్తికి కృషిచేస్తున్నారు. రఘువీర్ గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డు, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డులతోపాటు మిజోరాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2022లో ఉత్తమ రైతు అవార్డులను అందుకున్నారు. అంతరించిపోతున్న పురాతన విత్తనాలను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా తాను ముందుకువెళుతున్నానని రఘువీర్ ‘సాక్షి’కి తెలిపారు. ఐఏఐఆర్ నుంచి వినూత్న రైతు అవార్డు అందుకోవడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. -
ఏపీ రైతుకు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్‌ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇందులో భాగంగా 2023–25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్‌ను జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘువీర్ అవార్డు, ప్రశంసాపత్రంతోపాటు రూ.1.50లక్షల నగదు బహుమతిని అందుకున్నారు. 257 రకాలు సేకరించిన రఘువీర్ అత్యంత పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో రఘువీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వచ్చారు. దేశవ్యాప్తంగా తిరిగి ఇప్పటి వరకు 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు ఉన్నాయి. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని సొంత పొలం 1.3 ఎకరాల్లో సంరక్షిస్తున్నారు. వీటిని భవిష్యత్ తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధి(సీడ్ బ్యాంక్)ను ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో ‘విత్తన నిధి’ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పురాతన వరి విత్తనాలను అందించడమే కాదు... వాటి సాగులో మెళకువలపై అవగాహన కలి్పంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు నాలుగు రకాల పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. -
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
కోర్టులో‘లగాన్’ నటుడు
‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు, ‘లగాన్’ వంటి అనేక సినిమాల ద్వారా సినిమా ప్రియులకు సుపరిచతుడైన నటుడు రఘువీర్ యాదవ్ విడాకుల కేసును ఎదుర్కొంటున్నాడు. రఘువీర్ యాదవ్, పూర్ణిమ 1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్ డాన్సర్ అయితే1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడనీ అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్ పత్రిక రాసింది. రఘువీర్ యాదవ్ భారతీయ నాటకరంగంలో చాలా పెద్ద పేరు. టెలివిజన్ రంగంలో ‘ముల్లా నసీరుద్దీన్’, ‘అమరావతి కే కహానియా’ వంటి ఎన్నో సీరియల్స్‌లో పని చేశాడు. ‘సలాం బాంబే’, ‘రుడాలీ’, ‘బాండిట్ క్వీన్’ సినిమాలలో ముఖ్య పాత్రలు ధరించాడు. ‘డియర్ ఫ్రెండ్ హిట్లర్’ సినిమాలో హిట్లర్ పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు 62 సంవత్సరాల వయసులో కోర్టు మెట్లు ఎక్కనున్నాడు. అతడి భార్య అతడి నుంచి చట్టపరంగా విడిపోవడానికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు నమోదు చేసింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకు నెలకు లక్ష రూపాయల ఇంటిరియమ్ మెయింటెన్స్, మంజూరయ్యాక పది కోట్ల పరిహారం రఘువీర్ యాదవ్ నుంచి కోరుతోంది. రఘువీర్ యాదవ్, పూర్ణిమ 1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్ డాన్సర్ అయితే 1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడు అనీ, అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ, తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్ పత్రిక రాసింది. ‘అతడు వేరొకరితో సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేశాడు’ అని పూర్ణిమ ఆరోపిస్తోంది. రఘువీర్ యాదవ్ మేనేజర్ రోష్నీ అర్చెజాను ఇందుకు కారణంగా చెబుతోంది. ‘ప్రస్తుతం అతను నెలకు నలభై వేల రూపాయలు ఖర్చులకు ఇస్తున్నాడు. అవి కూడా సరిగ్గా సమయానికి ఇవ్వడు. నాకు న్యాయం కావాలి’ అని పూర్ణిమ తన పిటిషన్లో పేర్కొంది. ‘ఎక్కడ భరణం ఇవ్వాల్సి వస్తుందో అని ఆస్తులు రోష్నీ పేరు మీద మార్చేశాడు’ అని కూడా పూర్ణిమ చెప్పింది. ఈ విషయమై రఘువీర్ యాదవ్‌ను సంప్రదించగా ‘ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది’ అని ఊరుకున్నాడు. 2017లో సూపర్ హిట్ అయిన సినిమా ‘న్యూటన్’లో రఘువీర్ యాదవ్ కార్డ్స్ ఆడుతూ కనిపించే ఎన్నికల అధికారిగా నటించాడు. ప్రస్తుతం అతడికి మంచి ముక్క పడట్లేదని మాత్రం ఈ ఉదంతం తెలియచేస్తోంది. -
జవాబుదారీతనం పెరిగింది
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ తొలిసారిగా 1988లో సబ్–ఇన్స్పెక్టర్లను ఎంపిక చేసింది. ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 400 మంది ఎస్సైలు 1989 బ్యాచ్ అధికారులుగా ఆ ఏడాది జనవరి 16న పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రస్తుతం అదనపు డీసీపీ స్థాయిలో ఉన్న వారు సిటీలో తొమ్మిది మంది ఉన్నారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ వారిలో ఒకరు. ఈ మూడు దశాబ్ధాల ప్రయాణంలో తాను గమనించిన మార్పుచేర్పులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలివీ... ‘యూనిఫాం’ కోసమే.. చిన్నప్పటి నుంచి క్రీడలు, సమకాలీన అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపించే రఘువీర్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బలగాలు, సంస్థల్లో ఉద్యోగంలో చేరాల్సిన వారే. ఆయన తండ్రి భారత వాయుసేనలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. తన ముగ్గురు కుమారులను ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చి దేశానికి సేవ చేయించాలన్నది ఆయన ఆశయం. మిగిలిన ఇద్దరూ అదే మార్గంలో వెళ్లినా... ఓ చిత్రమైన ఘటన రఘువీర్‌కు ఎయిర్‌ఫోర్స్‌ను దూరం చేసింది. ఎన్సీసీలో కీలకంగా వ్యవహరించిన ఆయన 80వ దశకంలోనే వాయుసేన సెలక్షన్స్‌కు వెళ్లారు. బెంగళూరులోని ఎలహంక బేస్‌లో సాగుతున్న ఈ ప్రక్రియకు ఆ బ్యాచ్‌లో రఘువీర్‌తో పాటు మరో తొమ్మిది మంది హాజరయ్యారు. ఎంపిక దాదాపు పూర్తయిన సం దర్భం లో ఓ అభ్యర్థి పర్సు చోరీకి గురైంది. ఈ దొంగ తనం చేసింది ఎవరో తేల్చలేకపోయిన సెలక్షన్ అధికారులు మొత్తం 10 మందినీ వెనక్కు పంపే శారు. ఆపై రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా ఉద్యోగం వచ్చినా... తండ్రి మాట ప్రకారం యూనిఫాం కోసం కష్టపడి ఎస్సైగా ఎంపికయ్యారు. అప్పట్లో అకాడమీ లేదు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులకు పోలీసు అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. అయితే 1998లో పోలీసు అకాడమీ నిర్మాణంలో ఉంది. దీంతో ఈ బ్యాచ్‌కు చెందిన 400 మందికీ అనంతపురం, అంబర్పేటల్లోని పోలీసు ట్రైనింగ్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చారు. ఓ ప్రాంతం వారిని మరో ప్రాంతానికి మార్చి దీనిని పూర్తి చేశారు. ఎస్సై అభ్యర్థులకు శిక్షణలో రూ.250, ప్రొబేషనరీలో రూ.800 వరకు, డిక్లేర్ అయిన తర్వాత రూ.1500 మాత్రమే జీతభత్యాలుగా చెల్లించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పెంపుతో ఇవన్నీ వేలు దాటి లక్షలకు చేరిపోయాయి. అప్పట్లోనే కాదు నాలుగైదేళ్ల క్రితం వరకు పోలీసుస్టేషన్లలో సరైన సదుపాయాలు ఉండేవి కాదు. గోడలకు రంగులు, పైకప్పులకు హంగులే కాదు... కూర్చోడానికి కుర్చీలు, టేబుళ్లు సైతం కరువే. అయితే ప్రస్తుతం వీటితో పాటు స్టేషనరీ సైతం ప్రతి స్థాయి అధికారికీ వచ్చి చేరుతోంది. అన్ని స్థాయిల వారికీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. జవాబుదారీతనం పెరిగింది... ఒకప్పుడు ఫిర్యాదుదారుల్లో ఇప్పటి స్థాయి అవగాహన ఉండేది కాదు. అప్పట్లో ఎవరైనా కంప్లైట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చి దాని విషయం ఆరా తీయడానికి ఆలోచించేవారు. ప్రతి ఒక్కరూ కాకపోయినా చాలా అంశాల్లో పరిస్థితి ఇలానే ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజల్లో చట్టం పట్ల, పోలీసుల పనితీరుపట్ల పెరిగిన అవగాహనతో పోలీసుల్లో జవాబుదారీతనం వచ్చింది. ఒకప్పుడు ఉన్నతాధికారులు కింది స్థాయి వారితో ప్రవర్తించే తీరుకు, ఇప్పటి పరిస్థితులకు అసలు సంబంధం లేదు. నేరాలు నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడం అప్పట్లో శక్తికి మించిన పనులుగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలు, క్రైమ్ ల్యాబ్స్... వంటి వాటి వల్ల ఇప్పుడు ఈ రెండిటితో పాటు నేరాలు నిరోధించడమూ తేలికగా మారింది. ఇప్పుడు ఎన్ని రకాల నేరాలు ఉన్నా.. సైబర్ క్రైమ్స్ మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇవే ప్రజలు, పోలీసులకు పెను సవాల్‌గా మారే ప్రమాదం పొంచి ఉంది. -
అమ్మాయి ఆత్మకథ
అటవీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం’. ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రలో నటించారు. రమణ ఎస్.వి (వెంకట్రావ్) దర్శకత్వంలో సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై శ్రీసత్య జయ కోమలీదేవి నిర్మించారు. రఘువీర్, వర్ష, శ్రావణ్, జీవా, గిరిధర్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారాల మధ్య అడవిని, తన జాతిని కాపాడుకునే ఓ అమ్మాయి ఆత్మకథతో ఈ చిత్రం రూపొందించాం. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మా సినిమా పాటలను దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరిగారు రిలీజ్ చేసి, బాగున్నాయని అభినందించారు. ఈ చిత్రానికి చంద్రబోస్‌గారు పాటలు రాయడంతో పాటు ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. అమర్, లైన్ ప్రొడ్యూసర్స్: భాస్కర్, రామారావు. -
అడవిలో ఏం జరిగింది?
సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై యస్వీ రయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన్యం’. రఘువీర్, శిరీష దాసరి, ‘బాహుబలి’ ప్రభాకర్, వర్ష ముఖ్య తారలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ఆడియో సీడీని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి విడుదల చేసి మొదటి సీడీని పాటల రచయిత చంద్రబోస్‌కి అందించారు. హీరో రఘువీర్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదిక్ మెడిసన్ చదివే మెడికోలు ఎప్పుడూ ఏదో ఒక మందు కనుక్కోవాలి. అలా కనుక్కొని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. అలాంటి పాత్రను ఇందులో చేస్తున్నాను. ఆ మందు కనిపెట్టే ప్రాసెస్‌లో నా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? దెయ్యం రూపంలో మాకు ప్రమాదం సంభవిస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి? ఆ కష్టాల నుండి ఎంతమంది బయటపడ్డాం? ఎంతమంది చనిపోయారు. అసలు దెయ్యం ఉందా, లేదా?’’ అనేది కాన్సెప్ట్’’ అన్నారు. ‘‘రమణ చాలా నిబద్ధత కలిగిన దర్శకుడు. హీరో రఘువీర్‌కు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు వైవీయస్ చౌదరి. చంద్రబోస్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో ‘చినుకల్లే కురిసింది’ అనే పాట పాడాను. ఈ పాట నేనే రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సదాచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.కోమలీదేవి, మేముల సత్యనారాయణ. -
‘వై’దొలిగేదెందుకో..
జానా వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటో... * పార్టీ తలనొప్పులు భరించలేకా? * కుమారుడు రఘువీర్‌కు లైన్‌క్లియర్ చేసేందుకేనా? * జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన సీఎల్పీ నేత అంతరంగం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. సీఎల్పీ పదవి చేపట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా వారికి పదవి అప్పగిస్తా... శాసనసభలో లేకపోయినా సీఎం కావచ్చు... ఏ పాత్రలో ఉన్నా న్యాయం చేస్తా..’’ అంటూ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదాలో ఉన్న ఆయన ఎన్నికలకు నాలుగున్నరేళ్లు సమయమున్నా...ఎందుకిలా అన్నారు..? ఆయన అంతరంగమేంటి..? అనే దానిపై రాజకీయవర్గాలు ఆసక్తికర అంచనాలు కడుతున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ఉన్న జానా... ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశించినా రాలేదు... అనంతరం ఆయన సీఎల్పీ బాధ్యతలు చేపట్టినా మిగిలిన ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాలంటే వైరాగ్యంతో ఇంత తొందరగా ఆ వ్యాఖ్యలు చేశారా? లేదంటే ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తన వారసుడికి అవకాశం ఇచ్చేందుకా? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్న తలనొప్పులు ఎందుకులే అనే ఆలోచనతో మాట్లాడారా? ఇన్నాళ్లూ జిల్లా రాజకీయ రంగంలో సీనియర్ నాయకుడిగా ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకునేలా రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్నారా? అనేది అంతుపట్టక, జానా అంతరంగం అర్థం కాక అటు నియోజకవర్గ ప్రజలు, ఇటు జిల్లా రాజకీయవర్గాలు పలు రకాలుగా ఈ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నాయి. కుమారుడి కోసమా? పార్టీ చికాకులా? వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే విషయమై జానా చేసిన వ్యాఖ్యలు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డికి లైన్‌క్లియర్ చేసేందుకేననే చర్చ ప్రధానంగా జరుగుతోంది. జానా తప్పుకుంటే తన వారసుడిగా రఘువీర్‌ను ఎంపిక చేసుకున్నారనేది నియోజకవర్గంలో బహిరంగ రహస్యమే. రఘువీర్ చాలా కాలంగా క్రియాశీలంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రికి సాయంగా అన్నీ తానై నియోజకవర్గంలో పార్టీని నడిపించారు. ఇప్పుడు రఘువీర్‌ను తెరపైకి తెచ్చేందుకుగాను నియోజకవర్గంలో అన్నీ కుదుటపడేందుకు ఇంత త్వర గా తాను తప్పుకుంటానని జానా సంకేతాలిచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు కూడా జానా వ్యాఖ్యలకు కారణమై ఉంటాయన్నది పరిశీలకుల అంచనా. సీఎం పదవిని ఆశించిన జానా ప్రజాతీర్పుమేరకు ప్రతిపక్షంలో కూర్చోవడం, ఆ తర్వాత సీఎల్పీ నేతగా ఎంపిక కావడం.. సీఎల్పీ నేత హోదాలో ఆయనకు పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు సహకరించకపోవడం... స్వపక్షంలోనే విపక్షంలా కాంగ్రెస్ నేతలు వ్యవహ రించడం ఆయనకు నచ్చడం లేదని సమాచారం. అందుకే సీఎల్పీ నేత పదవిని నిర్వహించేందుకు ఎవరు ముందుకు వచ్చినా తాను తప్పుకుంటానని చెప్పారని అంటున్నారు. మరోవైపు జానాపై తన ప్రత్యర్థి చిన్నపురెడ్డి అక్రమాస్తుల కేసును కూడా ఫైల్ చేశార ని, ఎన్నికలలో పోటీ చేయకుండా తానే తప్పుకుంటున్నట్టు ముందుగా ప్రకటిస్తే కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఇబ్బంది ఉండబోదని, సీనియర్ నేతగా తన గౌరవం నిలిచిపోతుందనే ఆలోచనతోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారని రాజకీయ ప్రత్యర్థులంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ జానా ఇదే మాట చెప్పారని నియోజకవర్గ నేతలు అంటున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పారని, ఆ తర్వాత మనసు మార్చుకుని బరిలో ఉన్నారని, ఇప్పుడు కూడా జానా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆయన మనసు మార్చుకుని మళ్లీ పోటీలో ఉంటారని, లేదంటే కుమారుడు రఘువీర్ నాయకత్వంలో పనిచేస్తామని ఆయన అభిమానులు, నేతలు చెబుతున్నారు. సీఎం రేసు నుంచి వైదొలిగేంతవరకు జిల్లా రాజకీయాల్లో తనదైన గుర్తింపు ఉన్న జానారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎదురులేని రికార్డు సంపాదించుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1994 ఎన్నికలలో వైవిధ్య పరిస్థితుల్లో ఓటమి పాలయ్యారు. విశేషమేమిటంటే... ఎప్పుడో పెక్కుశాఖల మంత్రిగా పేరొందిన ఈయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని సన్నిహితులు చెబుతుంటారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఈయన అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించి రాణించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈయన తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ ఆమరణదీక్ష తర్వాత తెలంగాణ ప్రకటన నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం వైదొలిగిన వెంటనే జానా నివాసంలోనే జేఏసీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఇక ఆ తర్వాత రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ముందువరుసలో ఉన్నారు. అంతకు ముందు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలు అయినప్పుడు కూడా ఈయనపేరు పరిశీలనకు వచ్చింది. కానీ కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన ప్రతిపక్ష నేత హోదాకే పరిమితమయ్యారు. శాసనసభకు ఎన్నిక కాకపోయినా ఎంత మంది సీఎంలు కాలేదు అని జానా వ్యాఖ్యానించడం చూస్తే, ఆయన వచ్చే ఎన్నికలలో పోటీచేయకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం సీఎం రేసులో ఉంటానని చెప్పడం గమనార్హం. -
నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి
బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్ (46) మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. 'శృంగార కావ్య' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలాకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆయనకు నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయనను బీటీఎం లేఅవుట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.