సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్‌ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది.
ఇందులో భాగంగా 2023–25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్‌ను జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘువీర్ అవార్డు, ప్రశంసాపత్రంతోపాటు రూ.1.50లక్షల నగదు బహుమతిని అందుకున్నారు.
257 రకాలు సేకరించిన రఘువీర్
అత్యంత పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో రఘువీర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వచ్చారు. దేశవ్యాప్తంగా తిరిగి ఇప్పటి వరకు 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు ఉన్నాయి. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని సొంత పొలం 1.3 ఎకరాల్లో సంరక్షిస్తున్నారు.
వీటిని భవిష్యత్ తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధి(సీడ్ బ్యాంక్)ను ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో ‘విత్తన నిధి’ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పురాతన వరి విత్తనాలను అందించడమే కాదు... వాటి సాగులో మెళకువలపై అవగాహన కలి్పంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు నాలుగు రకాల పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment