‘వై’దొలిగేదెందుకో..
జానా వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటో...
* పార్టీ తలనొప్పులు భరించలేకా?
* కుమారుడు రఘువీర్‌కు లైన్‌క్లియర్ చేసేందుకేనా?
* జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన సీఎల్పీ నేత అంతరంగం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. సీఎల్పీ పదవి చేపట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా వారికి పదవి అప్పగిస్తా... శాసనసభలో లేకపోయినా సీఎం కావచ్చు... ఏ పాత్రలో ఉన్నా న్యాయం చేస్తా..’’ అంటూ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదాలో ఉన్న ఆయన ఎన్నికలకు నాలుగున్నరేళ్లు సమయమున్నా...ఎందుకిలా అన్నారు..? ఆయన అంతరంగమేంటి..? అనే దానిపై రాజకీయవర్గాలు ఆసక్తికర అంచనాలు కడుతున్నాయి.
కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ఉన్న జానా... ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశించినా రాలేదు... అనంతరం ఆయన సీఎల్పీ బాధ్యతలు చేపట్టినా మిగిలిన ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాలంటే వైరాగ్యంతో ఇంత తొందరగా ఆ వ్యాఖ్యలు చేశారా? లేదంటే ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తన వారసుడికి అవకాశం ఇచ్చేందుకా? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్న తలనొప్పులు ఎందుకులే అనే ఆలోచనతో మాట్లాడారా? ఇన్నాళ్లూ జిల్లా రాజకీయ రంగంలో సీనియర్ నాయకుడిగా ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకునేలా రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్నారా? అనేది అంతుపట్టక, జానా అంతరంగం అర్థం కాక అటు నియోజకవర్గ ప్రజలు, ఇటు జిల్లా రాజకీయవర్గాలు పలు రకాలుగా ఈ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నాయి.
కుమారుడి కోసమా? పార్టీ చికాకులా?
వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే విషయమై జానా చేసిన వ్యాఖ్యలు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డికి లైన్‌క్లియర్ చేసేందుకేననే చర్చ ప్రధానంగా జరుగుతోంది. జానా తప్పుకుంటే తన వారసుడిగా రఘువీర్‌ను ఎంపిక చేసుకున్నారనేది నియోజకవర్గంలో బహిరంగ రహస్యమే. రఘువీర్ చాలా కాలంగా క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో తండ్రికి సాయంగా అన్నీ తానై నియోజకవర్గంలో పార్టీని నడిపించారు. ఇప్పుడు రఘువీర్‌ను తెరపైకి తెచ్చేందుకుగాను నియోజకవర్గంలో అన్నీ కుదుటపడేందుకు ఇంత త్వర గా తాను తప్పుకుంటానని జానా సంకేతాలిచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు కూడా జానా వ్యాఖ్యలకు కారణమై ఉంటాయన్నది పరిశీలకుల అంచనా. సీఎం పదవిని ఆశించిన జానా ప్రజాతీర్పుమేరకు ప్రతిపక్షంలో కూర్చోవడం, ఆ తర్వాత సీఎల్పీ నేతగా ఎంపిక కావడం.. సీఎల్పీ నేత హోదాలో ఆయనకు పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు సహకరించకపోవడం... స్వపక్షంలోనే విపక్షంలా కాంగ్రెస్ నేతలు వ్యవహ రించడం ఆయనకు నచ్చడం లేదని సమాచారం.
అందుకే సీఎల్పీ నేత పదవిని నిర్వహించేందుకు ఎవరు ముందుకు వచ్చినా తాను తప్పుకుంటానని చెప్పారని అంటున్నారు. మరోవైపు జానాపై తన ప్రత్యర్థి చిన్నపురెడ్డి అక్రమాస్తుల కేసును కూడా ఫైల్ చేశార ని, ఎన్నికలలో పోటీ చేయకుండా తానే తప్పుకుంటున్నట్టు ముందుగా ప్రకటిస్తే కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఇబ్బంది ఉండబోదని, సీనియర్ నేతగా తన గౌరవం నిలిచిపోతుందనే ఆలోచనతోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారని రాజకీయ ప్రత్యర్థులంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ జానా ఇదే మాట చెప్పారని నియోజకవర్గ నేతలు అంటున్నారు.
పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పారని, ఆ తర్వాత మనసు మార్చుకుని బరిలో ఉన్నారని, ఇప్పుడు కూడా జానా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆయన మనసు మార్చుకుని మళ్లీ పోటీలో ఉంటారని, లేదంటే కుమారుడు రఘువీర్ నాయకత్వంలో పనిచేస్తామని ఆయన అభిమానులు, నేతలు చెబుతున్నారు.
సీఎం రేసు నుంచి వైదొలిగేంతవరకు
జిల్లా రాజకీయాల్లో తనదైన గుర్తింపు ఉన్న జానారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎదురులేని రికార్డు సంపాదించుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1994 ఎన్నికలలో వైవిధ్య పరిస్థితుల్లో ఓటమి పాలయ్యారు. విశేషమేమిటంటే... ఎప్పుడో పెక్కుశాఖల మంత్రిగా పేరొందిన ఈయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని సన్నిహితులు చెబుతుంటారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఈయన అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించి రాణించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈయన తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ ఆమరణదీక్ష తర్వాత తెలంగాణ ప్రకటన నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం వైదొలిగిన వెంటనే జానా నివాసంలోనే జేఏసీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఇక ఆ తర్వాత రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ముందువరుసలో ఉన్నారు.
అంతకు ముందు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలు అయినప్పుడు కూడా ఈయనపేరు పరిశీలనకు వచ్చింది. కానీ కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన ప్రతిపక్ష నేత హోదాకే పరిమితమయ్యారు. శాసనసభకు ఎన్నిక కాకపోయినా ఎంత మంది సీఎంలు కాలేదు అని జానా వ్యాఖ్యానించడం చూస్తే, ఆయన వచ్చే ఎన్నికలలో పోటీచేయకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం సీఎం రేసులో ఉంటానని చెప్పడం గమనార్హం.