చంద్రబాబు పెద్ద నటుడు: పాండిచ్చేరి సీఎం
తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలవరం మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో నారాయణస్వామి మాట్లాడుతూ..చంద్రబాబుకు పబ్లిసిటీ పైనే పిచ్చి అని, ఏపీలో అదే విధమైన పరిపాలన సాగుతోందని విమర్శించారు.
ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోదీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజల జీవనాడి అని, పోలవరానికి ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఘంటా పధంగా చెప్పారు.
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ..
పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అభివర్ణించారు. ప్రత్యేక హోదాలాగే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెడతారనే అనుమానం ఉందన్నారు. టీడీపీ ఎంపీలు వేడుకుంటే గానీ ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ చంద్రబాబుకు దక్కలేదని విమర్శించారు. చంద్రబాబు గతంలోలాగ ప్రధాని మోదీతో రహస్య భేటీలు జరిపితే కుదరదన్నారు.
ఈ పాదయాత్రకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్లు మద్ధతు తెలిపారు. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి పోలవరం మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల్లో 47 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈ నెల పదో తేదీన పోలవరంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు వరకు 12.4 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.