బిహార్ వెళ్లి చెబుతాం: రఘువీరా
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని.. లేదంటే.. ఏపీకి జరిగిన మోసాన్ని ఎన్నికలు జరుగుతున్న బిహార్ లో ప్రచారం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హెచ్చరించారు. రాజధాని శంకుస్థాపనకు ఈనెల 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని .. ప్రత్యేక హోదా.. విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇందిరాభవన్ లో రఘువీరా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని స్పందించక పోతే.. బీజేపీ మోసాన్ని ఎండగడతామని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఈనెలాఖరున బిహార్ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్ లో జరిగిన అభివృద్ది తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వివరించారు. వారం రోజులుగా ప్రధాని అపాయింట్ మెంట్ అడుగుతున్నా స్పందించక పోవడం ఇవ్వక పోవడం దారుణమన్నారు.