సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలిసినా తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇప్పుడు మోదీ తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వగా, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్వంలో పలువురు విద్యార్థులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎన్‌ఎస్‌యూఐ–బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చొక్కా చిరిగిపోయి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన సోనియాకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, మోదీ లాంటి నేతలు ఎంత అక్కసు వెళ్లగక్కినా తెలంగాణకు జరిగే నష్టమేమీ లేదన్నారు.
యావత్ తెలంగాణ ప్రజలను పార్లమెంటులో అవమానించిన మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యత తీసుకుని మోదీ చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇక, రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌గౌడ్, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌ల నేతృత్వంలో గాంధీభవన్ ఎదుట మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల మోదీ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment