ఏమి‘టీ’దారుణం
అతను టీ అమ్ముకుని జీవనం సాగించే చిరు వ్యాపారి. టీ అమ్ముకుంటేనే అతని కుటుంబం గడుస్తుంది. లేదంటే పస్తులే. అలాంటి బడుగు జీవిపై ఓ జులాయి జులుం ప్రదర్శించాడు. టీ తాగినందుకు డబ్బులిమ్మని అడిగిన పాపానికి ఏకంగా గొడ్డలి తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడు.
క్రైం (కడప అర్బన్): టీ అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ ఇంటి యజమాని ఊపిరి ఓ యువకుని క్షణికావేశంతో ఆగిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోవడంతో ఇంటిల్లిపాది రోడ్డున పడ్డారు. మృతుని బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని మోచంపేటకు చెందిన షేక్ రహీం (48) ఎస్ఎఫ్ఎస్ వీధిలో టీ దుకాణాన్ని నిర్వహించుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య ఆరీఫా, కుమార్తె ఫిర్దోస్, కుమారుడు ఖాదర్‌బాషా ఉన్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఖాదర్‌బాషా ఉండేవాడు. ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తన తండ్రి కాచిన టీని ఖాదర్‌బాషా ప్లాస్క్‌లో తీసుకుని విక్రయించేందుకు దుకాణాల వద్దకు వెళ్లాడు. మరోవైపు రహీం టీ కాస్తుండగా అదే ప్రాంతంలో నివసిస్తున్న మౌలానా అనే యువకుడు టీ ఇవ్వాలని అడిగాడు. ఇందుకు రహీం టీకి డబ్బులు ఇవ్వాలని కోరాడు.
దీంతో ఆగ్రహించిన మౌలానా ‘నన్నే డబ్బులు అడుగుతావా? నీ అంతు చూస్తానని’ బెదిరిస్తూ ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే తన ఇంటి వద్దకు వెళ్లి పదునైన గొడ్డలి తీసుకువచ్చి రహీం తలపై ఒక్క వేటు వేశాడు. దీంతో రహీం అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడే ఉన్న స్థానికుడు ఫజల్ 108 వాహనంలో రిమ్స్‌కు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు వెంటనే అతని కుటుంబ సభ్యులు తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లగానే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని తిరిగి రిమ్స్‌కు తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని కడప వన్‌టౌన్ సీఐ కె.రమేష్, ఎస్ఐ మైనుద్దీన్‌లు తమ సిబ్బందితో పరిశీలించారు. రహీం కుమారుడు ఖాదర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎటు వైపు వెళుతోంది సమాజం
చిన్న చిన్న కారణాలకు క్షణికావేశం తోడై నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈనెల 23వ తేదీ వైవీ స్ట్రీట్‌లో మోటారు సైకిల్ వివాదంపై అన్న సాదత్ అలీఖాన్ సొంత తమ్ముడు దావూద్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి చంపాడు. వారం రోజులు తిరక్కముందే ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఎస్ఎఫ్ఎస్ వీధిలో టీకి డబ్బులు అడిగాడని రహీం అనే వ్యక్తిని మౌలానా అనే యువకుడు తలపై గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ దారుణం జరిగే సమయంలో ప్రతిఘటించేవారు కూడా లేకపోవడం విచారకరం. యువత దుర్వ్యసనాలకు బానిసై క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి ఇలా హత్యలకు పాల్పడటం గర్హనీయం.